Page Loader
Social Media Vetting: అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్‌.. ఏంటీ సోషల్‌ మీడియా వెట్టింగ్‌..?
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్‌.. ఏంటీ సోషల్‌ మీడియా వెట్టింగ్‌..?

Social Media Vetting: అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్‌.. ఏంటీ సోషల్‌ మీడియా వెట్టింగ్‌..?

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రవాస విధానాలను కఠినతరం చేసి విదేశీ విద్యార్థుల్లో గందరగోళాన్ని కలిగించగా, తాజాగా మరో కొత్త అంశం ఆందోళనను కలిగిస్తోంది. అదే 'సోషల్ మీడియా వెట్టింగ్'. అంటే విదేశాల నుంచి విద్యార్థులు అమెరికాకు రావడానికి దరఖాస్తు చేసే సమయంలో వారి సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ఖాతాలను పరిశీలించే ప్రక్రియ. ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో విద్యార్థి వీసా (Student Visa) కోసం కొత్తగా అప్లై చేసిన వారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

వివరాలు 

సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏమిటి? 

విద్యార్థులు వీసా పొందడానికి అనర్హులా, అర్హులా అన్నదాన్ని నిర్ణయించేందుకు వారి ఆన్‌లైన్ ప్రవర్తనను అధికారులు గమనించి విశ్లేషిస్తారు. దీనినే 'సోషల్ మీడియా వెట్టింగ్' అంటారు. విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఏమి పోస్ట్ చేస్తున్నారు, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు అనే అంశాలను అమెరికా అధికారులు పరిశీలిస్తారు. వీటి ఆధారంగా వారిని వీసా మంజూరుకు అర్హులుగా పరిగణిస్తారు. ఇప్పటికిప్పుడు అమెరికా ఈ ప్రక్రియను అమలు చేసే పనిలో ఉంది. అందువల్ల తాత్కాలికంగా విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలు నిలిపివేయబడ్డాయి.

వివరాలు 

ఈ తనిఖీలు ఎలా చేస్తారు? 

ఇప్పటికీ అమెరికా విదేశాంగ శాఖ ఈ వెట్టింగ్ ప్రక్రియకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయలేదు. అయితే, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం, యూదు వ్యతిరేకతను అరికట్టడం వంటి అంశాలపై దృష్టి పెట్టి ఈ తనిఖీలు జరుగుతాయని వెల్లడించింది. ఉదాహరణకు, ఓ విద్యార్థి తన సోషల్ మీడియా ఖాతాలో పాలస్తీనా జెండా లేదా ఆ దేశానికి మద్దతుగా ఉన్న పోస్ట్ చేస్తే, ఆ వ్యక్తిని మరింత లోతుగా పరిశీలిస్తారు. అతని నుండి అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం లేదని నిర్ధారించిన తర్వాతే అతనికి విద్యా వీసా మంజూరు చేస్తారు.

వివరాలు 

గత అనుభవాలు ఎలా ఉన్నాయి? 

గతంలో కూడా కొన్ని సందర్భాల్లో విద్యార్థులు, ప్రొఫెసర్ల సోషల్ మీడియా ఖాతాలను అధికారులు పరిశీలించారు. ఉదాహరణకు, 2024 మార్చిలో బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డా. రాషా అలావీ ఫోన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ ఫొటోలు కనిపించాయి. దీంతో ఆమె ఆన్‌లైన్ యాక్టివిటీని సమగ్రంగా పరిశీలించి అమెరికా నుంచి బహిష్కరించారు. ఇదే కాక గత ఏడాది అమెరికా యూనివర్సిటీల ప్రాంగణాల్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై మరింత దృష్టి పెట్టింది.

వివరాలు 

వీసా ప్రక్రియపై ప్రభావం 

ఇప్పుడు వీసా ఇంటర్వ్యూలోనే సోషల్ మీడియా వెట్టింగ్‌ను అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రభావంగా వీసా ప్రాసెసింగ్ నెమ్మదించడంతోపాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ స్టూడెంట్ అడ్వైజర్ లెక్కల ప్రకారం, విదేశీ విద్యార్థుల రాకతో అమెరికా విద్యా సంస్థలకు ఏటా సుమారు 43.8 బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో వీసా ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు సంక్షోభంలోకి వెళ్లే అవకాశముంది. అయితే, ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలు బుక్ చేసుకున్న విద్యార్థుల అపాయింట్‌మెంట్లు మునుపటి షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి. కొత్త అప్లికేషన్‌లు మాత్రం నిలిపివేయబడ్డాయి.