Loading...
Nvidia scandal: జెన్సన్‌ హువాంగ్‌ వ్యవహారంతో అమెరికా వాణిజ్య మంత్రికి చిక్కులు
జెన్సన్‌ హువాంగ్‌ వ్యవహారంతో అమెరికా వాణిజ్య మంత్రికి చిక్కులు

Nvidia scandal: జెన్సన్‌ హువాంగ్‌ వ్యవహారంతో అమెరికా వాణిజ్య మంత్రికి చిక్కులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో మరో కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ వ్యవహారం ఇప్పుడు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌కు తలనొప్పిగా మారింది. అత్యంత శక్తిమంతమైన ఏఐ చిప్స్‌ చైనాకు చేరకుండా అడ్డుకోవడంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లుట్నిక్‌ను మంత్రి పదవి నుంచి తొలగించే అంశంపై శ్వేతసౌధంలో చర్చలు జరుగుతున్నట్లు అమెరికా వార్తా సంస్థ ఓ కథనంలో వెల్లడించింది. ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ సైతం లుట్నిక్‌ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్‌కు లుట్నిక్‌పై పూర్తి విశ్వాసం ఉందని శ్వేతసౌధం ప్రతినిధి తాజాగా ప్రకటించడం గమనార్హం.

వివరాలు 

ఈ వ్యవహారంపై స్పందించిన రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ జాన్‌ కెన్నడీ

ఈ వ్యవహారంపై రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ జాన్‌ కెన్నడీ స్పందించారు.

లుట్నిక్‌ పదవిలో కొనసాగుతారా? లేదా? అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు.

అయితే, ఈ వ్యవహారంలో జరిగిన నష్టానికి సంబంధించి ఆయన కచ్చితంగా కాంగ్రెస్‌ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు సెనెటర్‌ టామ్‌ కాటన్‌.. చైనా సంస్థ సీఎక్స్‌ఎంటీని అమెరికా మార్కెట్‌ నుంచి నిషేధించాలని లుట్నిక్‌ను కోరారు.

వివరాలు 

అలిస్‌ సంబంధిత కంపెనీలో 50 వేల చిప్స్‌ అదనం!

సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్‌ కంపెనీకి సంబంధించిన ఓ ఎగ్జిక్యూటివ్‌కు,చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్‌ హువాంగ్‌కు సంబంధాలున్నట్లు వెల్లడైంది.

అలిస్‌తో ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మెగాస్పీడ్‌ కంపెనీ వ్యవహారాలు కూడా అనుమానాలకు తావిచ్చాయి.

ఆ సంస్థ తన అవసరాలకు మించి అదనంగా 50 వేల చిప్స్‌ను దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు.

అమెరికా అధికారులు మెగాస్పీడ్‌ డేటా సెంటర్‌ను తనిఖీ చేసిన సమయంలో ఈ విషయం బయటపడింది.

దీంతో చిప్స్‌ దిగుమతుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై అధికారుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

2025 నుంచి ఆ కంపెనీ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని అమెరికా వాణిజ్య శాఖలో గతంలో పనిచేసిన ఓ అధికారి పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

చైనా అనుసరించిన వ్యూహం ఇదే..

చైనాకు అత్యంత శక్తిమంతమైన చిప్స్‌ ఎగుమతి కాకుండా అడ్డుకునేందుకు జో బైడెన్‌ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది.

అయితే,ఈ నిబంధనలను తప్పించుకునేందుకు చైనా మరో మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

సింగపూర్‌,మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది.

అమెరికా నుంచి అధునాతన చిప్స్‌ను ఈ కేంద్రాలకు దిగుమతి చేసుకుని, వాటి ఏఐ కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని చైనా భూభాగం నుంచే రిమోట్‌ విధానంలో వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సింగపూర్‌లోని మెగాస్పీడ్‌ కంపెనీ ద్వారా భారీ సంఖ్యలో చిప్స్‌ను దిగుమతి చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

నేరుగా చైనాకు చిప్స్‌ సరఫరా చేయకుండా, ఇతర దేశాల్లోని డేటా సెంటర్లను ఉపయోగించుకోవడం ద్వారా అమెరికా ఆంక్షలను పరోక్షంగా అధిగమించే ప్రయత్నం జరిగినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

లుట్నిక్‌ అడ్డంకులతో నిలిచిన కొత్త నిబంధనలు

చైనా చిప్స్‌ ఎగుమతులను నియంత్రించేందుకు బైడెన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలను మరింత పటిష్ఠం చేసే ప్రయత్నాలు అమెరికా వాణిజ్య శాఖలో జరిగాయి.

ఆ శాఖలో పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగి ఈ విషయాలను అమెరికా మీడియాకు వెల్లడించారు.

ఆగ్నేయాసియా దేశాలకు ఏఐ చిప్స్‌ ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా ప్రత్యేక లైసెన్స్‌ తీసుకోవాల్సిన కొత్త విధానాన్ని రూపొందించే ప్రయత్నం జరిగిందని చెప్పారు.

అయితే, చివరకు వాణిజ్య మంత్రి లుట్నిక్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో అది అమల్లోకి రాలేదని వివరించారు.

ఈ నిబంధన అమలై ఉంటే మెగాస్పీడ్‌తో పాటు ఇతర ఆగ్నేయాసియా కంపెనీలకు చిప్స్‌ సరఫరా చేయడం అంత సులభంగా ఉండేది కాదని పేర్కొన్నారు.

వివరాలు 

లుట్నిక్‌ అడ్డంకులతో నిలిచిన కొత్త నిబంధనలు

చైనాకు అత్యంత శక్తిమంతమైన బ్లాక్‌వెల్‌ చిప్స్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ చేరకూడదని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేస్తుంటే.. మరోవైపు వాణిజ్య శాఖ మాత్రం ఆయన ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిందని కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెన్‌ రిలేషన్స్‌ ఫెలో క్రిస్‌ మెక్‌గైర్‌ ఆరోపించారు.

ప్రభుత్వ విధానాలకు, వాణిజ్య శాఖ చర్యలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

అలిస్‌ నిర్బంధంతో ఎన్విడియా ఆరా..

గతేడాది వేసవిలో అలిస్‌ హువాంగ్‌ను సింగపూర్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ పరిణామం తర్వాత ఎన్విడియా జనరల్‌ కౌన్సిల్‌ టిమ్‌ టెటెర్‌ నేరుగా అమెరికా వాణిజ్య శాఖ అధికారి జెఫ్రీ కెస్లెర్‌కు ఫోన్‌ చేశారు.

అలిస్‌ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు గురించి ఆరా తీశారు. అమెరికా బ్యూరో ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ సెక్యూరిటీ (బీఐఎస్‌) ఈ కేసులో దూకుడుగా ముందుకెళ్తోందా? అని ప్రశ్నించినట్లు సమాచారం.

ఈ ఫోన్‌ సంభాషణ తర్వాత ఈ వ్యవహారంపై వాణిజ్య శాఖ అధికారులు తమ దర్యాప్తు వేగాన్ని తగ్గించినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీంతో జెన్సన్‌ హువాంగ్‌ వ్యవహారం, చిప్స్‌ ఎగుమతులపై అమెరికా ప్రభుత్వ వైఖరి, వాణిజ్య శాఖ పాత్ర ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ADVERTISEMENT