Page Loader
Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె?
కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె?

Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె?

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈవిజయంతో ఆ పార్టీ నాయకుడు మార్క్‌ కార్నీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తన మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించారు. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌కి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆమెకు కెనడా కొత్త ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఇంతకు ముందు ఈ శాఖను మెలోనీ జోలీ నిర్వహించారు.ఇప్పుడు ఆమె స్థానంలో అనితా ఆనంద్‌ నియమితులయ్యారు. మెలోనీకి పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు.అనితా ఆనంద్‌ గతంలో రక్షణ మంత్రిగా సేవలందించారు. తాజాగా విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె,భగవద్గీతను చేతబట్టి ప్రమాణస్వీకారం చేయడం విశేషం.

వివరాలు 

ఎవరీ అనితా ఆనంద్‌.. 

58 ఏళ్ల అనితా ఆనంద్‌ భారతీయ మూలాలు కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు.ఆమె కెనడాలోని నోవాస్కోటియా ప్రావిన్స్‌లోని కెంట్‌విల్లే అనే పట్టణంలో జన్మించారు. ఆమె తల్లి సరోజ్‌ దౌలత్‌రామ్‌ అనస్తీషియాలజిస్ట్‌గా పనిచేశారు.తల్లి పంజాబ్‌కు చెందినవారు కాగా, తండ్రి సుందరం వివేక్‌ తమిళనాడుకు చెందిన జనరల్‌ సర్జన్‌. ఈ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉండగా,అనితా పెద్దవారు.ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు..గీత,సోనియా ఉన్నారు. అనితా పొలిటికల్‌ సైన్స్‌లో విద్యనభ్యసించారు.ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశారు. ఆ తరువాత డల్హౌసీ యూనివర్శిటీ నుంచి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. ఆమె తన వృత్తి జీవితాన్ని కార్పొరేట్‌ లాయర్‌గా ప్రారంభించి, అనంతరం పలు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో లా ప్రొఫెసర్‌గా, విజిటింగ్‌ లెక్చరర్‌గా, బోర్డు సభ్యురాలిగా పనిచేశారు.

వివరాలు 

జస్టిన్‌ ట్రూడో మంత్రివర్గంలో ఆమెకు స్థానం

ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి అక్కడ కూడా తనదైన ముద్రవేశారు. 2019లో లిబరల్‌ పార్టీ తరఫున ఓక్‌విల్లే నియోజకవర్గం నుంచి హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ కు ఎన్నికయ్యారు. తొలి సారి ఎంపీ అయినప్పటికీ, అప్పటి ప్రధాని జస్టిన్‌ ట్రూడో మంత్రివర్గంలో ఆమెకు స్థానం లభించింది. 2019 నుంచి 2021 వరకూ పబ్లిక్‌ సర్వీసెస్‌,ప్రొక్యూర్‌మెంట్‌ మంత్రిగా పనిచేశారు. ఈ పదవిని అలంకరించిన తొలి హిందూ మంత్రిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం రెండు సంవత్సరాలు రక్షణ మంత్రిగా సేవలందించారు.

వివరాలు 

ఉక్రెయిన్‌ కోసం ఆర్థిక సహాయ ప్యాకేజీ

రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌ కోసం ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించారు. అలాగే, సాయుధ దళాల్లో లైంగిక వేధింపుల నివారణకు చర్యలు తీసుకుని, పలు కీలక సంస్కరణలు అమలు చేశారు. ఈ కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. లింగ సమానత్వం, డైవర్సిటీ, ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం ఆమె తన స్థాయిలో పోరాటం చేశారు. అనంతరం రవాణా శాఖ, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖలకూ ఆమె సేవలందించారు. వృత్తి పరంగా న్యాయవాదిగా, వ్యాపారవేత్తగా పేరు పొందిన జాన్‌ నోల్టన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.