కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి!
భారత్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కోవిడ్-19 వ్యాక్సిన్ సిఫార్సులను సవరించింది. కరోనా కొత్త దశను అరికట్టడంతో పాటు అధిక జనాభాలో రోగనిరోధక శక్తిని పెంపొందేలా ఈ సవరణలను ప్రతిపాదించింది. ఆరోగ్యవంతమైన పిల్లలు, యువకులకు తప్పనిసరిగా బూస్టర్ డోస్ అవసరం లేదని, అయితే అధిక రిస్క్ ఉన్నవారు చివరి టీకా తర్వాత 6 నుంచి 12నెలల మధ్య బూస్టర్‌ను పొందాలని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. కోవిడ్-19 నుంచి మరణ ముప్పు ఉన్నవారు, ఇతర వ్యాధులతో బాధపడుతూ ప్రమాద తీవ్ర ఎక్కువ ఉన్న వారికి బూస్టర్ డోస్ విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌ఓ కొత్త సిఫార్సులు చెబుతున్నాయి.
కరోనా టీకా అవసరమైన జనాభాను మూడు స్థాయిలుగా విభజించిన డబ్ల్యూహెచ్‌ఓ
కొత్త సిఫార్సుల ప్రకారం, కరోనా టీకా అవసరమైన జనాభాను మూడు(అధిక, మధ్యస్థ, తక్కువ) స్థాయిలుగా డబ్ల్యూహెచ్‌ఓ విభజించింది. వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఇమ్యునో కాంప్రమైజింగ్ పరిస్థితులు ఉన్న యువకులు అధిక ప్రాధాన్యత కలిగిన సమూహంలో ఉన్నారు. వీరు చివరి డోస్ తర్వాత 6 లేదా 12 నెలల తర్వాత అదనపు బూస్టర్ డోసును డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసింది. ఆరోగ్యవంతమైన పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు మధ్యస్థ ప్రాధాన్యత సమూహంలోకి వస్తారు. వీరికి అదనపు బూస్టర్ డోసు సురక్షితమే అయినప్పటికీ, తప్పనిసరి కాదు. 6 నెలల నుంచి 17 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పిల్లలు, యువకులు తక్కువ ప్రాధాన్యత కలిగిన సమూహంలో ఉన్నారు.