
Dalai Lama: దలైలామా వారసత్వం ఎవరిది? - భారత్-చైనా మధ్య ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపిక అంశం భారత్-చైనా మధ్య మరో కీలక దౌత్య సమస్యగా మారింది. ఈ క్రమంలో భారతదేశంలో కొందరు వ్యక్తులు దలైలామా వారసత్వంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా, ఇలాంటి వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే అవకాశముందని హెచ్చరించింది. ఆదివారం చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. దలైలామా వారసత్వం, పునర్జన్మ వంటి విషయాలు చైనా అంతర్గత వ్యవహారాలు అని చెబుతూ, ఇందులో భారత్ జోక్యం చేసుకోకూడదని చైనా స్పష్టం చేసింది.
Details
బౌద్ధ సంప్రదాయాల ప్రకారం ఎంపిక జరగాలి
భారత విదేశాంగ నిపుణులు టిబెట్‌కు సంబంధించిన సమస్యల సున్నితత్వాన్ని అవగాహన చేసుకోవాలని సూచించింది. మరోవైపు, భారత్ మాత్రం టిబెట్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం మాత్రమే దలైలామా వారసుడి ఎంపిక జరగాలని అభిప్రాయపడుతోంది. ఈ వివాదం చైనా చేసిన తాజా వ్యాఖ్యలు గాల్వాన్ లోయ ఘటన (2020) తరువాత భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీజింగ్‌లో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యితో జైశంకర్ చర్చలు జరపనున్న నేపథ్యంలో, ఈ అంశం భారత్-చైనా సంబంధాల్లో మరో సున్నితమైన సమస్యగా మారనుంది. టిబెట్ నియంత్రణపై దాదాపు ఆరు దశాబ్దాలుగా దలైలామా - చైనా ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
Details
పూర్తిగా దలైలామా చేతుల్లోనే ఉంటుంది
ఇటీవల దలైలామా మాట్లాడుతూ, తన తరువాతి జన్మ చైనాలో కాకుండా వేరే దేశంలో, ముఖ్యంగా భారత్‌లోనూ జరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు. తన వారసుడి ఎంపికపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా తనదే అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా అధికారికంగా స్పందిస్తూ, దలైలామా వారసత్వంపై తాము నిర్ణయించే హక్కు కలిగిన ఏకైక అధికారం అని పేర్కొంది. తమ ఆమోదం లేకుండా ఎవరు వారసుడిని ప్రకటించినా, అది అంగీకారయోగ్యం కాదని వెల్లడించింది. ఇక దలైలామా పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.
Details
విదేశీ జోక్యాన్ని సహించం
ఇతరులకు ఆ అధికారం లేదని, ఇది బౌద్ధ సంప్రదాయాలతో ముడిపడిన అంశమని వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయాలను తిప్పికొట్టేలా చైనా తాజా హెచ్చరికలు, మరోసారి తన అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని సహించబోమన్న స్పష్టతను చాటాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-చైనా మధ్య ఇప్పటికే ఉక్కిరిబిక్కిరిగా ఉన్న సంబంధాలు, మరింత క్లిష్టమైన దశలోకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.