LOADING...
Trump-Putin peace talks: ట్రంప్-పుతిన్ ఉక్రెయిన్ శాంతి చర్చల వేదికగా అలాస్కానే  ఎందుకు ఎంపిక చేశారు ? 

Trump-Putin peace talks: ట్రంప్-పుతిన్ ఉక్రెయిన్ శాంతి చర్చల వేదికగా అలాస్కానే  ఎందుకు ఎంపిక చేశారు ? 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో చర్చలు అలాస్కాలో జరగనున్నాయి. అమెరికాలోని అతిపెద్ద నగరం యాంకరేజ్ లేదా ఇంకా ప్రకటించని మరో ప్రదేశం ఈ సమావేశానికి వేదిక కానుంది. సుమారు మూడున్నరేళ్లుగా కొనసాగుతున్నఈ యుద్ధానికి ఇది కీలక మలుపు కావడంతో పాటు అమెరికా-రష్యా సంబంధాలకూ,దేశాల మధ్య వారధిగా నిలిచిన అలాస్కా చరిత్రకూ ఇది ప్రత్యేక ఘట్టం కానుంది. ఈ ఏడాది ఆరంభంలో ట్రంప్ తిరిగి వైట్‌హౌస్‌లోకి వచ్చిన తర్వాత,అమెరికా భూభాగంలో ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి కలవడంఇదే మొదటి సారి. ఈ క్రమంలో అమెరికా,రష్యాలు తూర్పు యూరప్‌లో భూభాగాల మార్పిడి అవకాశం ఉంటుందన్న సంకేతాలిచ్చారు.

వివరాలు 

ఈ సదస్సును ధృవీకరించిన క్రెమ్లిన్

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ కూడా ఈ చర్చల్లో పాలుపంచుకుంటారు. ట్రంప్ ప్రకారం, మూడు దేశాలు హింస ఆగేలా ఒక అంగీకారానికి దగ్గరలో ఉన్నాయి. ఆయన "భూభాగాల మార్పిడి రెండు దేశాలకు లాభదాయకంగా ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. క్రెమ్లిన్ కూడా ఈ సదస్సును ధృవీకరించింది. పుతిన్ సీనియర్ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ, "ఉక్రెయిన్ సంక్షోభానికి దీర్ఘకాల శాంతి పరిష్కారం సాధించే మార్గాలపై చర్చ జరగనుంది" అని తెలిపారు. జెలెన్‌స్కీ తన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సరైన రాజకీయ-ఆర్థిక ఒత్తిడి కొనసాగితే కాల్పుల విరమణ సాధ్యమవుతుందని చెప్పారు.

వివరాలు 

ICC యుద్ధ నేరాల కేసులో పుతిన్‌పై అరెస్టు వారెంట్ జారీ 

అలాస్కాను సమావేశ స్థలంగా ఎంచుకోవడానికి ముఖ్య కారణం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) సమస్యలనుంచి తప్పించుకోవడమే. ICC యుద్ధ నేరాల కేసులో పుతిన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ICC సభ్య దేశాలు అతడిని తమ భూభాగంలో అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అమెరికా ICC సభ్యదేశం కాదు కాబట్టి ఈ చట్టపరమైన బంధనాలు ఉండవు. అదనంగా, అలాస్కా రష్యాకు భౌగోళికంగా దగ్గరగా ఉంటుంది. బేరింగ్ జలసంధి దాటితే కేవలం 88 కిలోమీటర్ల దూరమే. ముందుగా యుఏఈ వంటి ప్రదేశాలను కూడా పరిశీలించినప్పటికీ, ట్రంప్ చివరికి అలాస్కానే వేదికగా ప్రకటించారు.

వివరాలు 

అమెరికాకు వ్యూహాత్మకంగా,ఆర్థికంగా కీలక రాష్ట్రం

అలాస్కాకు రష్యాతో ఉన్న సంబంధం 18వ శతాబ్దం నాటిది. అప్పట్లో రష్యా సామ్రాజ్యం ఈ ప్రాంతంలో వేట, వ్యాపార కేంద్రాలు నెలకొల్పింది. 1867 మార్చి 30న $7.2 మిలియన్‌కు(ఎకరాకు రెండు సెంట్లు)అమెరికా-రష్యా ఒప్పందం కుదిరి, అలాస్కా అమెరికా ఆధీనంలోకి వచ్చింది. తరువాత బంగారం, పెట్రోలియం, ఖనిజ సంపదతో అమెరికాకు వ్యూహాత్మకంగా,ఆర్థికంగా కీలక రాష్ట్రంగా మారింది. 1959లో అలాస్కా 49వ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. నేటికీ ఇది విస్తారమైన చమురు నిల్వలను కలిగి ఉండి, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సౌలభ్యాలను కల్పిస్తోంది. వ్యూహాత్మకంగా కూడా అలాస్కా అమెరికాకు అత్యంత కీలకం. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఏకైక అమెరికా రాష్ట్రం కావడంతో,వాతావరణ మార్పుల వల్ల కొత్త నావికా మార్గాలు,వనరుల అన్వేషణలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది.

వివరాలు 

యుద్ధం ముగించాలని పుతిన్ పై ఒత్తిడి తెస్తున్న ట్రంప్ 

ఇంతకుముందు కూడా అలాస్కా అంతర్జాతీయ దౌత్య వేదికగా నిలిచింది. 2021లో ఇక్కడ అమెరికా-చైనా ప్రతినిధులు, 1984లో పోప్ జాన్ పాల్-రేగన్ సమావేశం, 1971లో నిక్సన్-జపాన్ చక్రవర్తి భేటీలు జరిగాయి. అలాస్కా గవర్నర్ మైక్ డన్‌లేవీ ఈ సమావేశానికి స్వాగతం పలుకుతూ, "ఉత్తర అమెరికా-ఆసియాల మధ్య కూడలిలో ఉన్న అలాస్కా, ప్రపంచ వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం" అన్నారు. ఇతర నేతలు కూడా ఈ సమావేశాన్ని స్వాగతించారు. ట్రంప్ ఈసారి పుతిన్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తూనే, యుద్ధం ముగించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ, కాల్పుల విరమణ ఒప్పందం కుదరని పక్షంలో రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. 2018లో హెల్సింకిలో ట్రంప్-పుతిన్ చివరిసారి కలిశారు.

వివరాలు 

క్రిమియా సహా నాలుగు ప్రాంతాలపై హక్కు ఉందన్న పుతిన్ 

ఉక్రెయిన్ విషయానికి వస్తే, పుతిన్ ఇప్పటికే క్రిమియా సహా నాలుగు ప్రాంతాలపై హక్కు ఉందని వాదిస్తున్నారు. ఈ భూభాగాలను వదులుకోవడం ఉక్రెయిన్‌కు రాజకీయంగా, భావోద్వేగపరమైన విషయం. యుద్ధం మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసి, లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. ఈ నేపథ్యంలో, అలాస్కా సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.