అమెరికా హవాయి ద్వీపంలో కారుచిచ్చు .. సముద్రంలోకి దూకేస్తున్న ప్రజలు, 36 మంది మృత్యువాత
అగ్రరాజ్యం అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు దావాగ్నిలా వ్యాప్తి చెందింది. అడవుల్లో చెలరేగిన అగ్ని జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి. గాలులు వేగంగా వీస్తుండటంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఈ మేరకు మావీయ్ ద్వీపం కల్లోలంగా తయారైంది. మంటలు చుట్టుముడుతుండటంతో జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. భయాందోళనతో పడవల ద్వారా ద్వీపాన్ని వీడుతున్నారు. ఈ క్రమంలోనే సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు. మరికొందరు అగ్నిధాటికి తట్టుకోలేక ప్రాణాలు కాపాడుకునేందుకు సముద్రంలోకి దూకేశారు. కార్పిచ్చు కారణంగా ఇప్పటికే 36 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అగ్గి చుట్టుముట్టడంతో 16 దారులు మూసివేత
గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్(హెలికాఫ్టర్) ద్వారా వివిధ ఆస్పత్రులకు తరలించారు. మంగళవారం రాత్రి నుంచి కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం. హవాయిలో గంటకు 82 మైళ్ల బుల్లెట్ వేగంతో, మావీయ్‌లో గంటకు 62 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీచినట్లు అధికారులు ప్రకటించారు. అగ్ని ధాటికి చాలా మేర భవనాలు దెబ్బతిన్నాయన్నారు. చెట్లు, కార్లు, ఇతర వాహనాలు కాలిపోయినట్లు తెలిపారు. అగ్గి చుట్టుముట్టిన కారణంగా 16 రోడ్లను ఇప్పటికే మూసేశారు. ప్రస్తుతం ఒక్క హైవేని మాత్రమే అందుబాటులో ఉంటారు. కార్చిచ్చు ఘటనపై స్పందించిన జో బైడెన్ చనిపోయిన వారి కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. హవాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్ సహాయక చర్యలు చేపడుతోంది. ఆర్మీ, నేవీలూ పనిచేయాలని అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.