LOADING...
Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా
అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా

Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

విదేశాలకు పారిపోయిన బిలియనీర్‌ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయ్యే అవకాశాలు ఉండటంతోనే భారత్‌ విడిచి వెళ్లిపోయినట్టు వెల్లడించారు. తాను ఏ దొంగతనానికీ పాల్పడలేదని స్పష్టం చేశారు.అసలు దొంగతనమే ఎక్కడ జరిగిందో చెప్పాలంటూ ప్రశ్నించారు. తాను తప్పకుండా దేశం నుంచి వెళ్లిపోయానని ఒప్పుకుంటూ, దొంగను కాదని తెలిపారు.

వివరాలు 

భారత్‌లో నాకు న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన జీవితం లభిస్తాయని ఎవరైనా హామీ ఇస్తే..

"నన్ను మీరు భారత్‌ నుంచి పారిపోయిన వ్యక్తిగా పిలవొచ్చు. కానీ దయచేసి నన్ను దొంగా అని లేబుల్‌ వేయకండి. నేను 2016లో ముందుగానే ప్రణాళిక వేసుకుని విదేశాలకు వెళ్లాను. కొన్ని కారణాల వల్ల తిరిగి రాలేకపోయాను. కానీ 'దొంగతనమే' అనే ఆరోపణ ఎక్కడి నుంచి వచ్చింది? భారత్‌లో నాకు న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన జీవితం లభిస్తాయని ఎవరైనా హామీ ఇస్తే, తిరిగి వచ్చేవాడిని. అయితే అలాంటి పరిస్థితులు దేశంలో లేవన్న స్పష్టత నాకు ఉంది" అని విజయ్ మాల్యా వివరించారు.

వివరాలు 

ఆర్థిక మాంద్యం వల్ల ఎయిర్‌లైన్‌ పునరుద్ధరణ కష్టంగా మారింది 

తాను ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను పునర్నిర్మించేందుకు అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసినట్టు తెలిపారు. ఆర్థిక మాంద్యం వల్ల ఎయిర్‌లైన్‌ పునరుద్ధరణ కష్టంగా మారిందని, అందుకే విమానాల సంఖ్యను తగ్గించడానికి, కొంతమంది ఉద్యోగులను తొలగించడానికి తానూ సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే, ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం లేదని, బ్యాంకుల నుంచి మద్దతు అందుతుందని ప్రణబ్ ముఖర్జీ తానకు భరోసా ఇచ్చినట్టు వెల్లడించారు. ఆ తరువాత నెలలు గడిచే కొద్దీ ఆర్థికంగా పరిస్థితులు మరింత దిగజారడంతో దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు.

వివరాలు 

2016 నుంచి బ్రిటన్‌లో..

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణాలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో మాల్యా వివిధ కేసులు ఎదుర్కొంటున్నారు. 2016 మార్చి నెల నుంచి ఆయన బ్రిటన్‌లో నివాసం ఉంటున్నారు. భారత్‌కు ఆయనను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అనేక మార్గాలలో ప్రయత్నాలు చేస్తోంది. తాను తీసుకున్న రుణాల కంటే చాలా రెట్లు బ్యాంకులు తన నుంచి రికవరీ చేశాయని, వాటికి సంబంధించిన ఖాతా వివరాలు అందించాలని కోరుతూ ఇటీవల మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే.