
Frank Caprio: 'అత్యంత దయగల న్యాయమూర్తి' ఫ్రాంక్ కాప్రియో మృతి
ఈ వార్తాకథనం ఏంటి
న్యాయస్థానంలో మానవత్వం,కరుణను పంచుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించిన ప్రముఖ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో (88) కన్నుమూశారు. కొంతకాలంగా పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన,చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "కాట్ ఇన్ ప్రొవిడెన్స్" అనే రియాలిటీ కోర్ట్ షో ద్వారా ఆయనకు ప్రత్యేకమైన పేరుప్రఖ్యాతులు వచ్చాయి. కాప్రియో మరణవార్తను తెలియజేస్తూ కుటుంబ సభ్యులు ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. "దయ, వినయం, మానవత్వంపై ఆయనకు ఉన్న అచంచల విశ్వాసం అనేక మంది జీవితాలను ప్రభావితం చేసింది. కాప్రియో చూపిన ఆప్యాయత, ఆయన హాస్య చతురత, దయాగుణం ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేసాయి" అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
వివరాలు
మరణానికి ముందు రోజు ప్రార్థనలు చేయమని అభిమానులను కోరిన కాప్రియో
మరణానికి కేవలం ఒకరోజు ముందు ఆసుపత్రిలో ఉండగానే కాప్రియో తన అనుచరులకు ఒక వీడియో సందేశాన్ని పంపారు. "దురదృష్టవశాత్తు నా ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది. నేను తిరిగి ఆసుపత్రిలో చేరాను. ఈ కఠినమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నాను. మీ ప్రార్థనలు నాకు బలాన్నిస్తాయి. దయచేసి నన్ను మీ ప్రార్థనల్లో గుర్తుంచుకోండి." ప్రార్థనల శక్తిపట్ల తనకు గాఢమైన నమ్మకం ఉందని కూడా ఆయన ఆ వీడియోలో స్పష్టం చేశారు. అమెరికాలోని ప్రొవిడెన్స్ మున్సిపల్ కోర్టులో దశాబ్దాలపాటు న్యాయమూర్తిగా పనిచేసిన కాప్రియో,తన విభిన్నమైన తీర్పులతో ప్రత్యేక గుర్తింపునందుకున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు విధించిన ట్రాఫిక్ టిక్కెట్లను రద్దు చేయడం,శిక్షతో పాటు వారికి స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పడం వంటి ప్రత్యేక తీరు ఆయనను ఇతరుల కంటే భిన్నంగా నిలబెట్టాయి.
వివరాలు
ష్ట్రంలోని జెండాల అవనతం
ఆయన కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ వంద కోట్లకు పైగా వ్యూస్ సాధించాయి. 2018 నుంచి 2020వరకు జాతీయ స్థాయిలో ప్రసారమైన"కాట్ ఇన్ ప్రొవిడెన్స్"షో అనేక డేటైమ్ ఎమ్మీ నామినేషన్లు పొందింది. చట్టాలఅమలు మాత్రమే న్యాయం కాదని,దానిలో దయ,గౌరవం,మానవత్వం కూడా ఉండాలని కాప్రియో గాఢంగా విశ్వసించేవారు. 2023లో తాను పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. కాప్రియో మరణంపై రోడ్ ఐలాండ్ గవర్నర్ డాన్ మెక్కీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఆయనను "రోడ్ ఐలాండ్ రాష్ట్రానికి నిజమైన ఆభరణం"గా అభివర్ణించిన గవర్నర్,ఆయన స్మారకార్థం రాష్ట్రంలోని జెండాలను అవనతం చేయాలని ఆదేశించారు. న్యాయాన్ని కరుణతో మిళితం చేసి అందించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన కాప్రియో,శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతారు.