Page Loader
Tomiko Itooka: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ టోమికో ఇతోకా కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ టోమికో ఇతోకా కన్నుమూత

Tomiko Itooka: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ టోమికో ఇతోకా కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా పేరొందిన జపాన్‌కు చెందిన టోమికో ఇతోకా (116) మృతి చెందారు. డిసెంబరు 29న వృద్ధాప్య కారణంగా ఆమె మృతిచెందినట్లు జపాన్ అధికారులు తెలిపారు. 1908, మే 23న ఒసాకోలో జన్మించిన ఇతోకా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకారం, గతేడాది స్పెయిన్‌కు చెందిన బ్రన్యాస్ (117) మృతి చెందడంతో ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా పేరొందారు. ఇతోకా గతేడాది మేలో పెద్ద ఎత్తున తన 116వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా, స్థానిక ప్రముఖులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇతోకా అరటిపళ్లను, జపాన్‌లో ప్రసిద్ధి చెందిన 'కాల్పిస్' అనే శీతలపానీయాన్ని ఎంతో ఇష్టపడ్డారు.

Details

ఆన్‌టేక్ శిఖరాన్ని రెండుసార్లు ఎక్కి రికార్డు

ఆమె పాఠశాల విద్యార్థిగా వాలీబాల్ ఆడేవారు. సుమారు 3,067 మీటర్ల ఎత్తయిన ఆన్‌టేక్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 20 ఏళ్ల వయసులో ఆమె వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1979లో భర్త మృతి చెందిన తరువాత, ఇతోకా నర నగరంలో ఒంటరిగానే జీవించారు. జెరొంటాలజీ రీసెర్చ్‌ గ్రూప్ తెలిపిన ప్రకారం, ఆమె మరణంతో ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా ప్రస్తుతం 116 ఏళ్ల నన్‌ కెనబర్రో లుకాస్‌ నిలిచారు. ఆమె బ్రెజిల్‌ నివాసి కాగా, ఇతోకాతో పోలిస్తే 16 రోజులు చిన్నవారు.