Page Loader
Trump: ఖతార్‌ విమాన బహుమతిపై ప్రశ్న.. 'గెట్ అవుట్' అంటూ.. విలేకరిపై మండిపడ్డ ట్రంప్ 
ఖతార్‌ విమాన బహుమతిపై ప్రశ్న.. 'గెట్ అవుట్' అంటూ.. విలేకరిపై మండిపడ్డ ట్రంప్

Trump: ఖతార్‌ విమాన బహుమతిపై ప్రశ్న.. 'గెట్ అవుట్' అంటూ.. విలేకరిపై మండిపడ్డ ట్రంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్‌ పాలకులు ఇచ్చిన విలాసవంతమైన విమానం బహుమతిగా ప్రకటించడంపై ఇటీవల వివాదం చెలరేగింది. ఈ విషయంలో ఓ విలేకరి ప్రశ్నించగా, ట్రంప్‌ అతనిపై తీవ్రంగా మండిపడ్డారు. విలేకరిగా పని చేయడానికి నీవు అర్హుడవ్‌ కాదు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సంఘటన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో ట్రంప్ భేటీ అనంతరం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోటుచేసుకుంది. ట్రంప్‌ను విమానం బహుమతిపై ప్రశ్నించగానే, ఆయన అసహనం వ్యక్తం చేశారు.

వివరాలు 

వార్తా సంస్థపై కూడా ట్రంప్ ఆగ్రహం

''నీవు ఏం మాట్లాడుతున్నావ్‌? ఇక్కడి నుంచి వెళ్లిపో. మేము చర్చిస్తున్న అంశానికి, ఖతార్‌ ఇచ్చిన విమానానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్లు ఆ విమానం ఇచ్చారు, అది గొప్ప విషయం. కానీ నువ్వు ఇప్పుడు దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్కడ జరుగుతున్న హింసను విస్మరింపజేసేందుకు ఇలా దారి మళ్లించే ప్రశ్నలు అడుగుతున్నావు. నీవు తెలివి తక్కువ వాడివి. విలేకరిగా నీకు అర్హత లేదు'' అంటూ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, ఆ విలేకరి పని చేస్తున్న వార్తా సంస్థపై కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహారాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని, విచారణ జరగాలని వ్యాఖ్యానించారు.

వివరాలు 

విమానంలో అవసరమైన సాంకేతిక, భద్రతాపరమైన మార్పులు

ఇటీవల ట్రంప్‌ మధ్యప్రాచ్యంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనకు ముందు ఖతార్‌ రాజ కుటుంబం తరఫున,అమెరికాకు విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. దీనిని స్వీకరించేందుకు ట్రంప్‌ ముందుగానే సిద్ధమయ్యారు. ఈ విమానాన్ని అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌కు సమానంగా మలచేందుకు ప్రత్యేకంగా హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీవిరమణ చేసే వరకూ ట్రంప్‌ ఈ విమానాన్ని కొత్త ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ వెర్షన్‌గా వినియోగించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఈ విమానాన్ని స్వీకరించేందుకు అమెరికా రక్షణ శాఖ కూడా అనుమతి ఇచ్చింది. అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని,ఈ విమానంలో అవసరమైన సాంకేతిక, భద్రతాపరమైన మార్పులు చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని పెంటగాన్‌ ప్రతినిధి సీన్ పార్నెట్ తెలిపారు.