LOADING...
Donald Trump: 'నువ్వే కదా యుద్ధంచేద్దాం అన్నావు'.. రక్షణ మంత్రిపై ట్రంప్ నిందలు
'నువ్వే కదా యుద్ధంచేద్దాం అన్నావు'.. రక్షణ మంత్రిపై ట్రంప్ నిందలు

Donald Trump: 'నువ్వే కదా యుద్ధంచేద్దాం అన్నావు'.. రక్షణ మంత్రిపై ట్రంప్ నిందలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ఇరాన్‌పై సైనిక చర్యకు వెళ్లేందుకు తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇచ్చిన సలహానే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. "యుద్ధం చేద్దామని నువ్వే కదా చెప్పింది? వాళ్ల వద్ద అణ్వాయుధాలు ఉండకూడదంటే దాడి చేయాలని నువ్వే సూచించావు కదా?" అంటూ ట్రంప్, తన పక్కనే ఉన్న హెగ్సెత్‌ను ఉద్దేశించి మాట్లాడటం వాషింగ్టన్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలతో అమెరికా ప్రభుత్వ అంతర్గత విభేదాలు బయటపడ్డట్లు కనిపిస్తోంది.

వివరాలు 

హెగ్సెత్ సలహాపై ట్రంప్ అసహనం

ఇరాన్ విషయంలో దూకుడుగా వ్యవహరించాలని హెగ్సెత్ ఇచ్చిన సూచనల వల్లే అమెరికా ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో పడిందని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి, ప్రతికూల పరిణామాలు ఆయనను అసంతృప్తికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలను తప్పించుకునేందుకు ట్రంప్ బాధ్యతను రక్షణ మంత్రిపైకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాడులు కొనసాగించాలని ఒత్తిడి తీసుకొస్తుండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది.

వివరాలు 

యుద్ధ వ్యూహంలో మార్పు సంకేతాలు

ట్రంప్ తాజా వ్యాఖ్యలతో అమెరికా తన యుద్ధ వ్యూహాన్ని పునర్విమర్శించే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించాలా లేదా తాత్కాలిక విరామం ఇవ్వాలా అన్న దానిపై ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు కూడా అదే దిశగా చేసినవని భావిస్తున్నారు. అధ్యక్షుడు, రక్షణ మంత్రికి మధ్య పెరిగిన విభేదాలు ఇరాన్ విషయంలో అమెరికా తదుపరి నిర్ణయంపై ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇదే సమయంలో హెగ్సెత్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రంప్ ఉన్నత స్థాయి భద్రతా సలహాదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం.

Advertisement