
Reduction in GST rates: జీఎస్టీ కోతతో పడిపోనున్న కార్ల ధరలు.. మధ్యతరగతి వారికి భారీ లాభం!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్ల తగ్గింపునకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇది ఆటో మొబైల్ రంగానికి ఊతమిచ్చే, సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించనుంది. తాజా నివేదికల ప్రకారం, రాబోయే జీఎస్టీ సంస్కరణలతో వాహనాలపై రూ.1 లక్ష వరకు ఆదా సాధ్యమవుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రేట్ల తగ్గింపు ప్రతిపాదన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం దీన్ని అత్యంత సానుకూల పరిణామంగా చూస్తోంది. ప్రస్తుతం 28శాతం పన్ను శ్రేణిలో ఉన్న దాదాపు 90శాతం వస్తువులను 18శాతం శ్రేణికి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. కార్లపై జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గితే, కొత్త కార్ల కొనుగోలు ఖర్చులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది.
Details
జీఎస్టీ తగ్గింపు ప్రభావం
ప్రసిద్ధ బ్రోకరేజ్ సంస్థ నోమురా అంచనా ప్రకారం, ఈ తగ్గింపు ప్రభావం చిన్న కార్లు, ఎస్‌యూవీలపై స్పష్టంగా కనబడనుంది. ప్రస్తుతం చిన్న కార్లపై 28శాతం జీఎస్టీ అమలులో ఉంది. ఇది తగ్గితే, మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్ల ధరలు పడిపోతాయి. ఎస్‌యూవీల విషయంలో ఇప్పటి 45శాతం నుంచి 40శాతానికి పన్ను తగ్గే అవకాశం ఉంది. దీని ఫలితంగా మారుతీ బ్రెజా, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్ల ధరలు తగ్గుతాయి. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే అనేక ఎస్‌యూవీలకూ ఇది వర్తిస్తుంది.
Details
ధరల్లో ఎంత తగ్గుదల?
తాజా నివేదికల ప్రకారం, వ్యాగన్‌ఆర్, బాలెనో, డిజైర్ వంటి చిన్న కార్ల ధరలు రూ.60,000 నుంచి రూ.80,000 వరకు తగ్గవచ్చు. ఎస్‌యూవీల ధరలు సెస్ రేట్ల ఆధారంగా వేరువేరుగా పడిపోతాయి. ఉదాహరణకు, మారుతీ బ్రెజా ధర దాదాపు రూ.40,000 తగ్గవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ధర ఏకంగా రూ.1.1 లక్ష వరకు తగ్గే అవకాశం ఉంది. ఎస్‌యూవీ విభాగం ఇప్పటివరకు ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధికి ప్రధాన కారణమయ్యింది. అయితే ఇటీవల మహీంద్రా & మహీంద్రా మినహా మిగతా కంపెనీలకు డిమాండ్ మందగించింది. ఈ నేపథ్యంలో మార్కెట్ వాటా కోసం పోటీ పెరుగుతుండగా, మొత్తం రంగం వృద్ధిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు కీలక మలుపు కానుంది.
Details
ప్రభావం EMIలపై కూడా
ఆన్‌రోడ్ ధర తగ్గడమే కాకుండా, జీఎస్టీ రేట్లు తగ్గడంతో కారు కొనుగోలు కోసం తీసుకునే లోన్ల EMIలు కూడా తగ్గుతాయి. ఫలితంగా మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుంది. అయితే, జీఎస్టీ రేట్ల తగ్గింపుపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రాబోయే రోజుల్లో ఏ వాహనంపై ఎంత తగ్గింపు వస్తుందనే వివరాలు స్పష్టమవుతాయి.