
Lamborghini Huracan: లగ్జరీ లంబోర్గిని కారు చోరీ.. కనిపెట్టిన చాట్‌జీపీటీ!
ఈ వార్తాకథనం ఏంటి
రెండేళ్ల క్రితం దొంగతనానికి గురైన లగ్జరీ కారు లంబోర్గిని హురాకాన్ ఈవీఓను కృత్రిమ మేధ (AI) సాయంతో తిరిగి గుర్తించారు. అమెరికాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దొంగతనానికి గురైన వాహనాలను వెతకడం యజమానులు,పోలీసులకు ఒక పెద్ద సవాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎన్నో పద్ధతులు ఉపయోగించినప్పటికీ, ఈసారి ఏఐ వినియోగించడం ప్రత్యేకతగా నిలిచింది. లగ్జరీ కారు యజమాని ఆండ్రూ గార్సియా తన హురాకాన్ ఈవీఓను రెండేళ్ల క్రితం కోల్పోయారు. ఆ సమయంలో అతని కారు మాత్రమే కాకుండా మరికొన్ని సూపర్‌కార్లు కూడా దొంగల ముఠా బారిన పడ్డాయి. అధికారులు దీన్ని మల్టీ మిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ కార్ల దొంగతనంగా గుర్తించారు.
వివరాలు
చాట్‌జీపీటీ సహాయంతో విశ్లేషించి,గూగుల్ లొకేషన్ ఫీచర్లను ఉపయోగించి..
ఆ గ్యాంగ్ డజన్ల కొద్దీ ఖరీదైన కార్లను అపహరించి, యజమానుల రికార్డులను తొలగించి పునర్విక్రయానికి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత చాలా వాహనాలు తిరిగి దొరికినా, గార్సియాకు చెందిన హురాకాన్ మాత్రం కనిపించలేదు. ఇటీవల ఆ కారులో ఒకప్పుడు ఉంచిన బిజినెస్ కార్డ్ ఆధారంగా ఓ వ్యక్తి గార్సియాను సంప్రదించాడు. అతను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కారు తాజా ఫొటోలు పంపించి,"మీరు ఈ వాహనాన్ని అమ్మేశారా?" అని ప్రశ్నించాడు. ఆఫొటోలు చూసిన గార్సియా స్వయంగా అన్వేషణ ప్రారంభించారు. అందులోని వివరాలను చాట్‌జీపీటీ సహాయంతో విశ్లేషించి,గూగుల్ లొకేషన్ ఫీచర్లను ఉపయోగించి కారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించగా,వారు ఆ ప్రదేశానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.పరిశీలనలో అది గార్సియాదేనని ధ్రువీకరించారు.
వివరాలు
లంబోర్గిని హురాకాన్ ఈవీఓ ప్రత్యేక డిజైన్
లంబోర్గిని హురాకాన్ ఈవీఓ ప్రత్యేక డిజైన్, ఆకర్షణీయమైన రేజింగ్ బుల్ లోగోతో సూపర్‌కారు ప్రేమికులను ఆకట్టుకుంటుంది. 5.2 లీటర్ల V10 ఇంజిన్‌తో పనిచేసే ఈ కారు 631 హెచ్‌పీ శక్తి, 600 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో లభించే ఈ మోడల్, కేవలం 2.9 సెకన్లలో 0-100 కి.మీ. వేగం చేరుకుంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 325 కి.మీ..