
First Tesla Car: దేశంలో తొలి టెస్లా కారు.. ఎవరు కొనుగోలు చేసారంటే ?
ఈ వార్తాకథనం ఏంటి
విద్యుత్ కార్లలో ఆగ్రగణ్య సంస్థ టెస్లా ఇటీవల భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా,టెస్లా సంస్థ దేశంలో తొలి కారు డెలివరీ చేసింది.తెలుపు రంగులోని 'మోడల్ వై' టెస్లా కారు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ కొన్నారు. ముంబైలోని టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ లో టెస్లా ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ మాట్లాడుతూ,దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పర్యావరణహిత వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో మహారాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. అలాగే, విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తాను ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్టు మంత్రి తెలిపారు.
వివరాలు
రెండు వేరియంట్లలో కారు
ప్రపంచ ప్రసిద్ధి వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కి చెందిన టెస్లా సంస్థ,ఇటీవలే భారత్‌లో విక్రయాలను ప్రారంభించిందని తెలిసిందే. జూలై 15న ముంబైలో తొలి షోరూం ప్రారంభం అయ్యింది. మధ్యశ్రేణి ఎస్‌యూవీ'మోడల్ వై'(Tesla Model Y)కార్ల విక్రయాలు కూడా అక్కడ ప్రారంభమయ్యాయి. చైనా (షాంఘై)లోని తమ ఫ్యాక్టరీలో పూర్తిగా తయారైన కార్లను(CBU - Completely Built Unit)భారత్‌లో దిగుమతి చేసుకుని టెస్లా విక్రయాలు ప్రారంభించింది. Rear-Wheel Drive వేరియంట్:ధర రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభం,ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 500 కిమీ ప్రయాణం. లాంగ్ రేంజ్ Rear-Wheel Drive వేరియంట్:ప్రారంభ ధర రూ. 67.89 లక్షలు,ఒకసారి ఛార్జ్ చేసుకుని 622 కిమీ ప్రయాణం సాధ్యం. ఈ కార్ల కోసం ఇప్పటివరకు 600 బుకింగ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది.