Honda-Nissan: హోండా,నిస్సాన్ విలీనం.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద వాహన గ్రూప్?
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు హోండా,నిస్సాన్ తమ మధ్య విలీనాన్ని అధికారికంగా ప్రకటించాయి. సోమవారం నాటి అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై రెండు కంపెనీలు సంతకాలు చేసినట్లు నిస్సాన్ సీఈవో వెల్లడించారు. ఈ విలీనం పూర్తయిన తర్వాత అమ్మకాల పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుత ఆటోమొబైల్ పరిశ్రమ పెను మార్పుల దశలో ఉంది, ఇందులో ఇంధన వనరులుగా పెట్రోల్, డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించడం, అలాగే చైనా కంపెనీల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని ఎదుర్కొవడం వంటి అంశాలు ముఖ్యంగా నిలిచాయి. ఈ పరిస్థితుల్లో ఈ విలీనం రెండు సంస్థలకు కూడా వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నష్టాలను పూడ్చుకునేందుకు ఈ విలీనం తోడ్పడుతుంది: మకోటో ఉచిడా
నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మకోటో ఉచిడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఈ విలీనం ద్వారా వినియోగదారులకు తక్కువ ధరలతో మెరుగైన ఉత్పత్తులను అందించగలగడం మా లక్ష్యం. జపాన్ ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో గ్లోబల్ పోటీదారుల కంటే వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడు ఖర్చులను తగ్గించడం ద్వారా నష్టాలను పూడ్చుకునేందుకు ఈ విలీనం తోడ్పడుతుంది" అని తెలిపారు.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ
ఇది అంచనాల్లో భాగంగా, ఈ నెల ప్రారంభంలో హోండా మరియు నిస్సాన్ మధ్య విలీన చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడ్డాయి. హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా ఈ ప్రక్రియలో విలీనం మరియు మూలధన వ్యయ ఒప్పందాలతో సహా అనేక అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు. అయితే దీనిపై పూర్తి వివరాలు చెప్పడానికి నిరాకరించారు. ఈ విలీనం విజయవంతమైతే, హోండా మరియు నిస్సాన్ సంయుక్తంగా వార్షికంగా 74 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించనున్నాయి. దీని ద్వారా, టయోటా, వోక్స్‌వ్యాగన్ తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థగా అవతరించనున్నాయి.