LOADING...
Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా షాక్.. ఇక ఆ రెండు పాపులర్ వేరియంట్లు నిలిపివేత
హ్యుందాయ్ క్రెటా షాక్.. ఇక ఆ రెండు పాపులర్ వేరియంట్లు నిలిపివేత

Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా షాక్.. ఇక ఆ రెండు పాపులర్ వేరియంట్లు నిలిపివేత

వ్రాసిన వారు Moogati Shabari
May 07, 2026
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. వినియోగదారుల అభిరుచులు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హ్యుందాయ్ ఇండియా తాజాగా క్రెటా వేరియంట్ లైనప్‌లో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు మంచి ఆదరణ పొందిన SX టెక్ (SX Tech), SX(O) వేరియంట్లను కంపెనీ పూర్తిగా నిలిపివేసింది.

వివరాలు

వేరియంట్ల సంఖ్యలో కోత..

ఇప్పటివరకు మొత్తం 9 వేరియంట్లలో అందుబాటులో ఉన్న క్రెటా, తాజా మార్పుల తర్వాత కేవలం 7 వేరియంట్లకే పరిమితమైంది. ప్రస్తుతం E, EX, EX(O), S(O), SX, SX ప్రీమియం, కింగ్ (King) వేరియంట్లు మాత్రమే విక్రయానికి ఉన్నాయి. మార్కెట్లో మంచి డిమాండ్ కొనసాగుతున్న సమయంలో హ్యుందాయ్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారితీసింది. ఈ మార్పుతో ముఖ్యంగా ఆధునిక భద్రతా సదుపాయాలను కోరుకునే వినియోగదారులు ప్రభావితమవుతున్నారు. ఎందుకంటే క్రెటాలో 'లెవల్-2 ADAS' ఫీచర్లను తక్కువ ధరలో అందించిన వేరియంట్ SX టెక్ మాత్రమే. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.15.69 లక్షల నుంచి రూ.17.22 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లో ADAS ఫీచర్లు కోరుకునే కస్టమర్లకు అవకాశాలు తగ్గిపోయాయి.

వివరాలు

ఫీచర్లు, ధరల్లో మార్పులేమీ లేవు..

ఇకపై క్రెటాలో ADAS టెక్నాలజీ కావాలంటే వినియోగదారులు నేరుగా టాప్-ఎండ్ 'కింగ్' వేరియంట్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో సుమారు రూ.1.48 లక్షల వరకు అదనపు వ్యయం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో టాప్ వేరియంట్‌గా ఉన్న SX(O) స్థానంలో 2025లో విడుదలైన 'కింగ్' వేరియంట్‌ను తీసుకురావడంతో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వేరియంట్ల సంఖ్యను తగ్గించినప్పటికీ, మిగిలిన ట్రిమ్స్‌లో హ్యుందాయ్ ఎలాంటి కొత్త ఫీచర్లను జోడించలేదు. అలాగే ధరల్లో కూడా ఎటువంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర రూ.10.79 లక్షల నుంచి ప్రారంభమై రూ.19.90 లక్షల వరకు కొనసాగుతోంది.

Advertisement

వివరాలు

హ్యుందాయ్ వ్యూహం ఇదేనా?

సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు అమ్మకాలు తక్కువగా ఉన్న వేరియంట్లను తొలగించడం లేదా ఉత్పత్తి నిర్వహణను సులభతరం చేయడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే క్రెటా విషయంలో మాత్రం వినియోగదారులను అధిక ధర కలిగిన 'కింగ్' వేరియంట్ వైపు మళ్లించే ప్రయత్నం కనిపిస్తోంది. కియా సెల్టోస్, మారుతీ గ్రాండ్ విటారా వంటి ప్రత్యర్థి మోడళ్ల నుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు హ్యుందాయ్ తన ప్రీమియం ఫీచర్లను హై-ఎండ్ వేరియంట్లకే పరిమితం చేస్తున్నట్లు భావిస్తున్నారు.

Advertisement