Hyundai SUV : అడాస్ ఫీచర్‌తో హ్యుందాయ్ కొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీ.. త్వరలోనే మార్కెట్లోకి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా మరోసారి ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రెండు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. వీటిలో ఒకటి యూరోప్ మార్కెట్‌లో ఇప్పటికే విక్రయాల్లో ఉన్న 'బేయన్' మోడల్ ఆధారంగా రూపొందుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ కాగా, మరొకటి భారత్‌లోనే అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. అయితే ప్రస్తుతం ఆటోమొబైల్ వర్గాల దృష్టంతా ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీపైనే కేంద్రీకృతమైంది. హ్యుందాయ్ ఇప్పటికే విక్రయిస్తున్న వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య ధర, పరిమాణంలో ఉన్న గ్యాప్‌ను భర్తీ చేయడమే ఈ కొత్త మోడల్ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
వివరాలు
డిజైన్, సైజులో కొత్త స్టైల్
మొదట్లో ఈ మోడల్ 4 మీటర్లలోపు పొడవుతో వచ్చి మారుతీ ఫ్రాంక్స్‌కు పోటీ ఇస్తుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ బేయన్ ఆధారిత ఎస్‌యూవీ దాదాపు 4.2 మీటర్ల పొడవుతో మార్కెట్‌లోకి రానుంది. హ్యుందాయ్ తాజా "సెన్సువస్ స్పోర్టినెస్" డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. బాక్సీ డిజైన్‌తో ఎత్తుగా కనిపించే ఈ ఎస్‌యూవీకి ప్రీమియం స్టైలింగ్ ఇవ్వనున్నారు. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఐస్-క్యూబ్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, హై-మౌంటెడ్ డీఆర్ఎల్స్, 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
వివరాలు
తొలిసారిగా డ్యూయల్ సిలిండర్ సీఎన్జీ
'Bc4i' అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ ఎస్‌యూవీలో అత్యంత ఆసక్తికర అంశం దీని పవర్‌ట్రెయిన్. 4 మీటర్లకు మించిన హ్యుందాయ్ మోడళ్లలో సీఎన్జీ ఆప్షన్‌తో రానున్న తొలి కారు ఇదే కావొచ్చని సమాచారం. ఇందులో టాటా మోడళ్ల తరహాలో డ్యూయల్ సిలిండర్ సీఎన్జీ సెటప్ అందించనున్నారని తెలుస్తోంది. దీని వల్ల బూట్ స్పేస్‌లో ఎక్కువ స్థలం లభించే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌తో మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతున్న మారుతీ సుజుకీ విక్టోరిస్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు
ఈ కొత్త ఎస్‌యూవీలో పలు ఇంజిన్ ఎంపికలు అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 114 బీహెచ్‌పీ పవర్, 144 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. పనితీరును మరింత మెరుగుపరచేందుకు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ లేదా కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా అందించే అవకాశం ఉంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి డీజిల్ వేరియంట్‌ను కూడా కంపెనీ లైన్-అప్‌లో చేర్చవచ్చని సమాచారం.
వివరాలు
టెక్నాలజీ, సేఫ్టీలో హైఎండ్ ఫోకస్
మారుతీ సుజుకీ విక్టోరిస్, గ్రాండ్ విటారా మాదిరిగా మల్టిపుల్ ఎస్‌యూవీ స్ట్రాటజీని ఇప్పుడు హ్యుందాయ్ కూడా అనుసరిస్తోంది. ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీలో ఆధునిక ఇంటీరియర్‌తో పాటు అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అధునాతన భద్రతా ఫీచర్లను అందించే అవకాశం ఉంది. మార్కెట్‌లో కోల్పోయిన వాటాను తిరిగి సాధించడమే లక్ష్యంగా హ్యుందాయ్ ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందని ఆటో నిపుణులు చెబుతున్నారు. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని 2027 మార్చి నాటికి మార్కెట్‌లోకి తీసుకురావచ్చని సమాచారం.