Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారుకు BE 6E పేరు.. ఇండిగో దావా
స్వదేశీ ఆటోమేకర్ మహీంద్రా ఇటీవల తన తన ప్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్లు BE 6E, XEC 9E ను మార్కెట్లో విడుదల చేసింది. వినియోగదారుల్ని ఆకర్షించే అధునాతన ఫీచర్లు, అద్భుతమైన లుక్స్‌తో ఈ కార్లను డిజైన్ చేసిన మహీంద్రా, వాటిని ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందేలా చేయింది. కానీ, ప్రస్తుతం BE 6E కారు మీద ఒక పెద్ద వివాదం ఏర్పడింది. భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో, ఢిల్లీ హైకోర్టులో ఈ కారు పేరు పై పిటిషన్ దాఖలు చేసింది.
BE 6E పేరును ట్రేడ్ మార్క్ గా రిజిస్టర్ చేసుకున్న మహీంద్రా ఎలక్ట్రిక్
ఇందులో ''6E'' అనే టర్మ్ పై ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇండిగో, తమ బ్రాండ్ గుర్తింపుగా "6E"ను ఉపయోగించుకుంటూ తమ ప్రయాణికులకు అనేక సేవలను అందిస్తుంటుంది. ఇందులో 6E ప్రైమ్, 6E ఫ్లెక్స్, 6E యాడ్-ఆన్‌లు వంటి సేవలను అందిస్తున్న ఇండిగో, 2015లో "6E లింక్" అనే ట్రేడ్ మార్క్‌ను రిజిస్టర్ చేసింది. అయితే, మహీంద్రా ఎలక్ట్రిక్ తన BE 6E పేరును ట్రేడ్ మార్క్ గా రిజిస్టర్ చేసుకుంది, ఇది ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఈ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో విచారించబడుతోంది. కోర్టు ముందు వచ్చిన ఈ కేసు, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వర్సెస్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ పేరుతో దాఖలు చేయబడింది.
మహీంద్రా, ఇండిగో మధ్య చర్చలు
అయితే, ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ అమిత్ బన్సాల్ తప్పుకున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 9న జరుగనుంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మహీంద్రా, ఇండిగో మధ్య చర్చలు ప్రారంభం అయ్యినట్లు ఇండిగో తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఇండిగో వారి ''6E'' సైట్లో ప్రయాణికులకు అనేక సౌకర్యాలు అందిస్తున్నందున, మహీంద్రా తమ కారులో ఇదే పేరు ఉపయోగించడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ విషయం పై కోర్టులో మరిన్ని విచారణలు జరగనున్నాయి.