Maruti Suzuki: వాహన ధరలను పెంచిన మారుతీ సుజుకీ.. జనవరి నుంచి అమల్లోకి..
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ ఎక్స్‌ఛేంజీ ఫైలింగ్‌లో ఈ విషయం వెల్లడించింది. జనవరి 2025 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానుండగా, పెరుగుదల కారు మోడల్, వేరియంట్ ఆధారంగా 4% వరకు ఉండొచ్చని అంచనా. వినియోగదారులపై భారం తగ్గించేందుకు వ్యయ నియంత్రణకు కంపెనీ ప్రయత్నిస్తున్నప్పటికీ, కొన్ని భాగాల ఖర్చుల పెరుగుదల మార్కెట్ పైకి బదలాయించక తప్పడం లేదని కంపెనీ తెలిపింది.
కార్ల ధరలను పెంచుతున్నహ్యుందాయ్ మోటార్స్
ఇక హ్యుందాయ్ మోటార్స్ కూడా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు నిన్న ప్రకటించింది. జనవరి 1 నుంచి తమ వాహన మోడళ్లపై కొంత మొత్తాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. ముడిసరుకుల ధరలు,ఇతర వ్యయాలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం హ్యుందాయ్ వాహనాల ధరలు గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి అయానిక్ వరకు రూ.5.92 లక్షల నుంచి రూ.46.05 లక్షల వరకు ఉన్నాయి. అదే విధంగా, మహీంద్రా కూడా తన స్కార్పియో ఎన్ మోడల్‌పై వేరియంట్లకు అనుగుణంగా రూ.25 వేల వరకు ధర పెంచింది. అదనంగా ఎక్స్‌యూవీ 300 రేట్లను కూడా సవరించింది. నిస్సాన్, ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ వంటి ఇతర కంపెనీలు కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి.