Mercedes Benz Eqs 580: సింగిల్ ఛార్జ్‌పై 949 కి.మీ.. గిన్నిస్ రికార్డులో మెర్సిడెస్ బెంజ్!
జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మేటిక్' అనే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ (బీఈవీ) సింగిల్ ఛార్జింగ్‌తో 949 కిమీ ప్రయాణించి గిన్నిస్ రికార్డును సృష్టించింది. ఈ రికార్డు సొంతం చేసుకున్న కారు, బెంగళూరు నుండి నవీ ముంబై వరకు ప్రయాణించగా, గిన్నిస్ బుక్ ప్రతినిధులు దీనిని రికార్డుగా ధ్రువీకరించారు. వాహన రద్దీ, రహదారి పనులు, దారి మళ్లింపులు, భారీ వర్షాలు ఉన్నా, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మేటిక్ ఈ రికార్డు సాధించడం విశేషం. ఈ కారు బెంగళూరు నుండి దావణగెరె, హుబ్లీ, బెళగావి, కొల్హాపుర్, సతారా, పుణె మీదుగా ప్రయాణించి నవీ ముంబైకి చేరుకుంది.
కారు సింగిల్ ఛార్జింగ్‌పై 916.74 కిమీ
ప్రతి 100 కిమీ దూరానికి 11.36 కిలోవాట్ అవర్ విద్యుత్ పవర్‌ను ఈ కారు వినియోగించింది. 'ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ' కారు నెలకొల్పిన రికార్డును ఈ కారుతో మెర్సిడెస్ బెంజ్ అధిగమించింది. ఆ కారు సింగిల్ ఛార్జింగ్‌పై 916.74 కిమీ ప్రయాణించింది. 'మేడ్ ఇన్ ఇండియా' ఈక్యూఎస్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను గెలుచుకోవడం పట్ల మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ రికార్డు సాధనకు సహకరించిన ఆటోకార్ ఇండియా బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని పుణె సమీపంలోని చకాన్ ప్లాంట్‌లో ఈ కార్లు తయారవుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ కారు ధర రూ.1.95 కోట్లు.