Page Loader
Nitin Gadkari : వాహానాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలన్న నితిన్ గడ్కరీ!
వాహానాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలన్న నితిన్ గడ్కరీ!

Nitin Gadkari : వాహానాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలన్న నితిన్ గడ్కరీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 26, 2023
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాలుష్యాన్ని తగ్గించడానికి, కొత్త వాటిని కొనుగోలు చేయడానికి, పాత వాహనాలను దశలవారీగా తొలగించడానికి వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కార్ల తయారీదారులను కోరారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పాత వాహనాలను స్క్రాపింగ్ చేయడం వల్ల కొత్త వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడంతోపాటు పాతవాటిని రీసైకిల్ చేయడంలో సాయపడుతుందన్నారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు 15-20 ఏళ్లు దాటిన వాహనాలను దశలవారీగా తొలగించేందుకు కేంద్రం గతంలో సమగ్ర వాహన స్క్రాపింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. పాత వాహనాలను దశలవారీగా తొలగించడానికి భారతదేశంలో తగినంత సంఖ్యలో వాహనాల స్క్రాపింగ్ యూనిట్లు లేకపోవడం గమనార్హం.

Details

కార్ల తయారీదారులు, డీలర్లు ముందుకు రావాలి

మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి కార్ల తయారీదారులు ఇప్పటికే తమ వాహనాల స్క్రాపింగ్ యూనిట్లను దేశవ్యాప్తంగా ప్రారంభించాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కార్ల తయారీదారులు, డీలర్లు ముందుకు రావాలని, వాహనాల స్క్రాపింగ్ విధానం వల్ల ఆటో మొబైల్ విక్రయాలు 18 శాతం పెరుగుతాయని గడ్కరీ గతంలో చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ ఆటోమొబైల్ తయారీ హబ్‌గా మార్చడంలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్క్రాప్డ్ వాహనాల నుంచి లభించే ముడి పదార్థాలను ఉపయోగించడం వల్ల ముడిసరుకు సేకరణపై 33 శాతం ఖర్చు ఆదా కానుంది.