Tata Motors: టాటా సంస్థ షాకింగ్ ప్రకటన.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న వాహనాల ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
మరోసారి ప్రఖ్యాత కార్లతయారీ కంపెనీలు ధరల పెంపుపై ఒకదాని తర్వాత ఒకటి ప్రకటనలు చేస్తున్నాయి.
ఇప్పటికే భారతీయ ఆటో మొబైల్ రంగంలో అగ్రగామి అయిన మారుతీ సుజుకీ,వాహన ప్రియులకు షాక్ ఇచ్చింది.
ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు స్పష్టం చేసింది.
మారుతీ ప్రత్యర్థిగా ఉన్న,దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ కూడా అదే మార్గాన్ని అనుసరించింది.
ఈసంస్థ తన వాణిజ్య వాహనాల ధరలను సుమారు 2శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది.
కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది.
ఆటోమోటివ్ పరిశ్రమపై ప్రభావం చూపుతున్న పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను సమతుల్యం చేయడానికే ఈధరల పెంపు అవసరమని కంపెనీ స్పష్టం చేసింది.
వివరాలు
మోడల్, వేరియంట్‌లపై ఆధారపడి ధరల మార్పు
"భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థగా ఉన్న టాటా మోటార్స్,ఈ రోజు తన వాణిజ్య వాహనాల శ్రేణిలో 2 శాతం వరకూ ధరల పెంపును ప్రకటించింది.
ఈ పెంపు ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది" అని కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
మోడల్, వేరియంట్‌లపై ఆధారపడి ఈ ధరల మార్పు ఉంటుందని టాటా మోటార్స్ పేర్కొంది. గత కొన్ని నెలలుగా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ పెరుగుతున్న ముడి పదార్థాల ఖర్చులు, అధిక లాజిస్టిక్స్ వ్యయాలు, సరఫరా గొలుసులో ఏర్పడుతున్న అంతరాయాల వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో, ధరల పెంపు అనివార్యమవుతోంది. ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ, పెరిగిన ఖర్చులలో కొంతభాగాన్ని వినియోగదారులపై మోపాల్సిన పరిస్థితి తయారైంది.
వివరాలు
వాహనాల ధరలను 4 శాతం వరకూ పెంచనున్న మారుతీ సుజుకీ
ఈ పరిణామాల్లో భాగంగా, మొదటగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ 2025 ఏప్రిల్ నుంచి వాహనాల ధరలను 4 శాతం వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది.
దీనికి ప్రధాన కారణంగా పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు, కార్యాచరణ వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పేర్కొంది.
మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ నిర్ణయాల తర్వాత, ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా వాహనాల ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు.
టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్, కార్లు, యుటిలిటీ వాహనాలు, పికప్ ట్రక్కులు, బస్సుల తయారీలో ప్రముఖ స్థానం పొందింది. మార్చి 17న టాటా మోటార్స్ షేర్ ధర 0.70 శాతం పెరిగి రూ. 660.10 వద్ద స్థిరపడింది.