Loading...
Tata Punch: టాటా పంచ్‌కు భారీ డిమాండ్.. ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త రికార్డు!
టాటా పంచ్‌కు భారీ డిమాండ్.. ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త రికార్డు!

Tata Punch: టాటా పంచ్‌కు భారీ డిమాండ్.. ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త రికార్డు!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 07, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత కార్ మార్కెట్‌లో టాటా పంచ్ తన హవాను మరింత పెంచుతోంది. 2021లో తొలిసారిగా మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వినియోగదారుల నుంచి మంచి స్పందన అందుకుంటున్న ఈ మైక్రో-ఎస్‌యూవీ.. తాజాగా వచ్చిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. ఆధునిక ఫీచర్లు, మెరుగైన డిజైన్, విభిన్న ఇంజిన్ ఆప్షన్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్న టాటా పంచ్ అమ్మకాల వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

వివరాలు

టాటా పంచ్‌దే దూకుడు..

భారత ఆటో మొబైల్ మార్కెట్లో టాటా పంచ్ అమ్మకాల జోరు కొనసాగుతోంది.

2026 జూలైలో ఈ మైక్రో-ఎస్‌యూవీ ఏకంగా 21,313 యూనిట్లను విక్రయించింది.

దీంతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

గత ఏడాది జూలైతో పోల్చితే ఈసారి అమ్మకాల్లో 97.62 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.

2026 జనవరిలో మార్కెట్లోకి వచ్చిన పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఈ వాహనానికి మరింత డిమాండ్ తీసుకురావడంలో కీలకంగా మారింది.

కొత్త రూపంతో పాటు అదనపు ఫీచర్లు, మెరుగైన క్యాబిన్‌తో వచ్చిన ఈ వెర్షన్ కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

2026 జూన్‌లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా పంచ్ నిలిచింది.

వివరాలు

ఫీచర్లతో నిండిన క్యాబిన్..

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లోనూ గణనీయమైన మార్పులు చేశారు.

క్యాబిన్‌కు మరింత ప్రీమియం లుక్ తీసుకురావడానికి డ్యూయల్-టోన్ ఇంటీరియర్ అందించారు.

ప్రయాణ సమయంలో సౌకర్యం కోసం పూర్తిగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థను కూడా ఇందులో పొందుపరిచారు.

అదనంగా ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన సెంట్రల్ కన్సోల్, టచ్ ఆధారిత హెచ్‌వీఏసీ కంట్రోల్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా చూపించేందుకు 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు.

భద్రత, సౌకర్యం విషయంలోనూ పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో పలు ఆధునిక సదుపాయాలను చేర్చారు.

ఇందులో 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, 10.25 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం వంటి ఫీచర్లు ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

టర్బో ఇంజిన్‌తో మరింత పవర్..

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పటికే ఉన్న ఇంజిన్ ఆప్షన్లకు అదనంగా కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను కూడా పరిచయం చేశారు. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్తో జత చేశారు.

టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 120 పీఎస్ పవర్, 170 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక సాధారణంగా అందించే 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ ఇంజిన్ 87.8 పీఎస్ పవర్, 115 ఎన్ఎం టార్క్ను అందిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

సిఎన్‌జీ ఆప్షన్ కూడా..

ఇంధన ఖర్చును తగ్గించుకోవాలని భావించే వినియోగదారుల కోసం టాటా పంచ్‌లో సిఎన్‌జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఈ వేరియంట్ 73.4 పీఎస్ పవర్, 103 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

ఆకర్షణీయమైన డిజైన్, 5-స్టార్ భద్రతా రేటింగ్, ఆధునిక ఫీచర్లు, విభిన్న ఇంజిన్ ఆప్షన్లతో టాటా పంచ్ మధ్యతరగతి కుటుంబాల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

ఇప్పటికే ఎస్‌యూవీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ మోడల్.. అమ్మకాల పరంగా కూడా వేగంగా దూసుకెళ్తోంది.

ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో టాటా పంచ్ మరిన్ని అమ్మకాల రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంది.

ADVERTISEMENT