LOADING...
Toyota: హైడ్రోజన్ స్కూటర్‌పై టొయోటా పేటెంట్.. టూ-వీలర్ రంగంలో కొత్త ప్రయోగం
హైడ్రోజన్ స్కూటర్‌పై టొయోటా పేటెంట్.. టూ-వీలర్ రంగంలో కొత్త ప్రయోగం

Toyota: హైడ్రోజన్ స్కూటర్‌పై టొయోటా పేటెంట్.. టూ-వీలర్ రంగంలో కొత్త ప్రయోగం

వ్రాసిన వారు Moogati Shabari
May 06, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ ఆటో దిగ్గజం టొయోటో తాజాగా హైడ్రోజన్‌తో నడిచే స్కూటర్‌కు సంబంధించిన పేటెంట్ దాఖలు చేసింది. దీంతో ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతను టూ-వీలర్ సెగ్మెంట్‌లోకి ఎలా తీసుకురావచ్చో తొలి సూచనలు లభిస్తున్నాయి. ఈ కొత్త కాన్సెప్ట్, ప్రముఖ మ్యాక్సీ స్కూటర్ సుజుకీ బుర్గ్మాన్ 400 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందించబడింది. ఇప్పటికే గ్రీన్ మొబిలిటీ విషయంలో ఎలక్ట్రిక్ వాహనాలే ప్రధానంగా చర్చలో ఉన్నప్పటికీ, హైడ్రోజన్ టెక్నాలజీ కూడా నెమ్మదిగా ప్రాధాన్యం సంపాదిస్తోంది.

వివరాలు

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్..

టొయోట ఇప్పటికే టొయొటా మిరాయ్ వంటి కార్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించింది. ఇప్పుడు అదే టెక్నాలజీని చిన్న వాహనాల్లో కూడా ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఈ పేటెంట్ ద్వారా తెలుస్తోంది. ఈ స్కూటర్‌లో ప్రధాన ఆకర్షణ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్. సాధారణంగా పెట్రోల్ నింపడం బదులుగా, ఇందులో మార్చుకునే హైడ్రోజన్ కానిస్టర్లను ఉపయోగించే విధంగా డిజైన్ చేశారు. ఇవి ఖాళీ అయితే వెంటనే కొత్తవి పెట్టుకునేలా ఉంటుంది. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉండే రిమూవబుల్ బ్యాటరీల మాదిరిగానే ఇది పనిచేస్తుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే, రీఫ్యూయలింగ్ ప్రక్రియ వేగంగా, సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

వివరాలు

హైడ్రోజన్ మొబిలిటీపై ప్రయోగాలు..

పేటెంట్‌లో కొన్ని ఆసక్తికరమైన మెకానికల్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. హైడ్రోజన్ ట్యాంక్‌ను సులభంగా తీసివేయడానికి అనుకూలంగా అమర్చారు. వినియోగదారులకు సులభంగా, సురక్షితంగా ఉండేలా స్వింగ్-అవుట్ మెకానిజం, లింకేజ్ ఆధారిత సిస్టమ్‌లను టొయోటా ప్రతిపాదించింది. ఇది పూర్తిగా కొత్త ఆలోచన కాదు. గతంలో సుజుకి సంస్థ జపాన్ మొబిలిటీ షో 2023లో హైడ్రోజన్‌తో నడిచే బుర్గ్మాన్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ప్రస్తుతం టొయొటా దాఖలు చేసిన ఈ పేటెంట్, అలాంటి కాన్సెప్ట్స్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా జపాన్ తయారీదారులు కలిసి హైడ్రోజన్ మొబిలిటీపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇది కనిపిస్తోంది.

Advertisement

వివరాలు

త్వరలోనే అధికారిక ప్రకటన..

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీకి ఒక పెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇది పనిచేసే సమయంలో ఉప ఉత్పత్తిగా నీరు మాత్రమే విడుదలవుతుంది. దీంతో సాధారణ అంతర్గత దహన ఇంజిన్లతో పోలిస్తే ఇది మరింత శుభ్రమైన ప్రత్యామ్నాయం అవుతుంది. అయితే కొన్ని సవాళ్లు ఇంకా ఉన్నాయి. హైడ్రోజన్ టెక్నాలజీ ఖర్చు ఎక్కువగా ఉండటం, అలాగే రీఫ్యూయలింగ్ మౌలిక సదుపాయాలు విస్తృతంగా లేకపోవడం టూ-వీలర్ సెగ్మెంట్‌లో దీని వ్యాప్తిని నెమ్మదింపజేయవచ్చు. ప్రస్తుతం ఇది కేవలం పేటెంట్ దశలోనే ఉంది. ఉత్పత్తి ప్రారంభంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయినప్పటికీ, శుభ్రమైన మొబిలిటీ కోసం తయారీదారులు ఇంకా విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నారన్న విషయం మాత్రం ఈ పరిణామం స్పష్టంగా చెబుతోంది.

Advertisement