Tata Indica: భారతీయ కార్ల పరిశ్రమకు ఆ కారు చాలా ప్రత్యేకం..అదేంటంటే..?
టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కుటుంబం. టాటా సంస్థ ఎన్నో రంగాలకు విస్తరించినా, ఆ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది టాటా కార్లే. 1991లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా (Ratan Tata) సంస్థను భారీగా విస్తరించారు. పేదవాడి కారైన టాటా నానోతోపాటు టాటా ఇండికా కార్లను మార్కెట్‌కు పరిచయం చేశారు. అంతేకాదు, ఎన్నో మోడళ్లను తీసుకొచ్చిన ఘనత ఆ కంపెనీది.
ఇండికా కారుపై రతన్ టాటా ప్రేమ
అయితే, ఎన్నో ఖరీదైన కార్లు తన కంపెనీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ, రతన్ టాటాకు మాత్రం టాటా మోటార్స్ రూపొందించిన 'ఇండికా' (Tata Indica) కారునే ఎక్కువ ఇష్టపడతారు. ఈ విషయం రతన్ టాటానే స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. ఇండికా కారుపై తనకున్న ప్రేమను చాటుతూ గతేడాది జనవరిలో ఓ పోస్టు పెట్టారు. ఆ కారు పక్కన నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, '25 సంవత్సరాల క్రితం, టాటా ఇండికాను ప్రారంభించడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది' అని రాసుకొచ్చారు.
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా నెక్సాన్..
టాటా మోటార్స్ సంస్థ 1998లో ఇండికాతో తన ప్యాసింజర్ కార్ల తయారీని ప్రారంభించింది. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాల్లోనే అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. క్యాబ్ సర్వీసులు ప్రారంభమైన తొలినాళ్లలో ఇండికా కారునే ఎక్కువగా ఉపయోగించేవారు. ఇండికాలో విస్టా, మాంజా అనే మోడల్స్‌ను విడుదల చేసినప్పటికీ, అవి అమ్మకాల్లో పెద్దగా రాణించలేకపోయాయి. దీంతో 2018లో టాటా మోటార్స్ ఇండికా తయారీని నిలిపివేసింది. ప్రయాణికుల భద్రతకు టాటా అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. అంతేకాదు, అందరికీ అందుబాటు ధరలోనే కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇండియాలో మొట్టమొదటి 5/5 రేటింగ్ సాధించిన కారు టాటా నెక్సాన్.. దీని సృష్టికర్త రతన్ టాటానే కావడం విశేషం.