LOADING...
Trump Tariff: ఫార్మా దిగుమతులపై 200% టారిఫ్‌.. ట్రంప్‌ వెనక్కి తగ్గుతారా?
ఫార్మా దిగుమతులపై 200% టారిఫ్‌.. ట్రంప్‌ వెనక్కి తగ్గుతారా?

Trump Tariff: ఫార్మా దిగుమతులపై 200% టారిఫ్‌.. ట్రంప్‌ వెనక్కి తగ్గుతారా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2025
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలు రంగాలపై టారిఫ్‌లను విధించి కఠిన వైఖరిని ప్రవర్తిస్తున్నారు. ప్రతి దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై వేర్వేరు రకాల పన్నులు విధించారు. అయితే ఇప్పటి వరకు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను మాత్రం పన్నుల పరిధిలోకి తీసుకురాలేదు. కానీ త్వరలోనే మందుల దిగుమతులపై 200 శాతం పన్ను విధించే అవకాశముందని ఫార్మా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Details

పెద్ద ఎత్తున ధరల పెరుగుదల ఆందోళన

ఒకేసారి సున్నా నుంచి 200 శాతం పన్ను విధించే ఆలోచనపై పీడబ్ల్యూసీ ప్రతినిధి మేటీ పెరీరా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలకు మందుల ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన ట్రంప్, దీనికి విరుద్ధంగా పన్నులు పెంచాలనే యోచనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా అమెరికాలో మందుల ధరలు భారీగా పెరగడంతో పాటు, కొరత సమస్య తలెత్తవచ్చని, ఆరోగ్య బీమా ప్రీమియం కూడా పెరిగిపోతుందని ఐఎన్‌జీ ఆర్థికవేత్త డైడెరిక్ స్టాడిగ్ హెచ్చరించారు.

Details

2027 నుంచి ప్రభావం?

అమెరికాలో ఫార్మా కంపెనీలపై ధరలు తగ్గించమని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. అలాగే ఇతర దేశాల ఉత్పత్తిని అమెరికాలో తయారు చేయాలని సూచిస్తున్నారు. కొన్ని కంపెనీలకు ఆ మేరకు ఇప్పటికే లేఖలు పంపించారు. స్థానిక ఉత్పత్తి పెంచుకునేందుకు, మందుల నిల్వలను భద్రపరచుకునేందుకు ఒకటి, రెండేళ్ల వరకు పన్నుల విధింపును వాయిదా వేస్తానని హామీ ఇచ్చారు. దీనివల్ల అమెరికా కంపెనీలు పెద్ద ఎత్తున మందులను దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నాయి. అందువల్ల 2027-2028 లోనే ఈ పన్నుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటికి ట్రంప్ 200 శాతం పన్నుల నిర్ణయం నుంచి వెనక్కి తగ్గి తక్కువ శాతం మాత్రమే విధించే అవకాశముందని కొందరు విశ్వసిస్తున్నారు.

Details

తయారీ కేంద్రాలు విదేశాలకు మార్పు 

అమెరికాలో తయారీ ఖర్చులు అధికంగా ఉండటంతో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి క్రమంగా చైనా, భారత్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ వంటి దేశాలకు తరలిపోయింది. ప్రస్తుతం అమెరికా మందుల వాణిజ్యంలో ఏటా 150 బిలియన్ డాలర్ల లోటు ఎదుర్కొంటోంది. ట్రంప్ ఒత్తిళ్ల కారణంగా కొన్ని కంపెనీలు అమెరికాలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. ఉదాహరణకు, స్విట్జర్లాండ్‌కు చెందిన రోష్ సంస్థ అమెరికాలో 50 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. అయితే స్థానికంగా తయారీని పూర్తిగా ప్రారంభించేందుకు కొన్నేళ్లు పడుతుందని, అంతేకాక అన్ని మందులను స్వదేశంలోనే ఉత్పత్తి చేయడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ముడి పదార్థాలు, ఏపీఐలు మాత్రం తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిందే.

Details

అందుకు అమెరికా సిద్ధమా?

అమెరికాలో తయారీ ఖర్చులు అధికంగా ఉండటంతో కొన్ని కంపెనీలు అధిక పన్నులు చెల్లించి మందులు అందించటం కంటే మార్కెట్‌ను పూర్తిగా వదిలేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పన్నులు పెంచడం ఒక్కటే పరిష్కారం కాదని, దీనికి ప్రభుత్వ సహకారం, మద్దతు కూడా అవసరమని బ్రూకింగ్స్ ప్రతినిధి వోసిన్స్కా తెలిపారు. కానీ ఇందుకు ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని, ఇప్పటి వరకు చౌకగా మందులు పొందేందుకు ఇతర దేశాలపై ఆధారపడిన అమెరికా ఇప్పుడు మొత్తం వ్యవస్థను మార్చడానికి సిద్ధంగా ఉందా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.