
Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌కు శత్రుదేశంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు భారతీయులు గట్టిగా బదులిస్తున్నారు.
ఈ దేశాలపై అసంతృప్తితో ఉన్న భారత పర్యాటకులు తమ మనోభావాలతో ఆడుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు.
ఇప్పటికే టర్కీకి పర్యటించేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసినదే. ఇదే దిశగా, అజర్ బైజాన్‌కి వెళ్లే వారి సంఖ్య కూడా భారీగా పడిపోయింది.
తాజా నివేదికల ప్రకారం, ఈ రెండు దేశాలకు సంబంధించి వీసా అప్లికేషన్లలో 42 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడైంది.
వివరాలు
భారత సైన్యం చేసిన ప్రతీకార దాడుల్లో ఇద్దరు టర్కీ నిపుణులు మృతి
ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ, అజర్ బైజాన్ నిలవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ప్రత్యేకంగా టర్కీ, తన ఆధునిక డ్రోన్లను పాకిస్తాన్‌కు సరఫరా చేయడమే కాకుండా, వాటిని నడిపేందుకు ఇద్దరు టర్కీ వ్యక్తులను నియమించింది.
అయితే, భారత సైన్యం చేసిన ప్రతీకార దాడుల్లో ఆ ఇద్దరు టర్కీ నిపుణులు మరణించినట్లు సమాచారం.
వీసా ప్రక్రియల నిర్వహణలో ప్రముఖ సంస్థ అయిన 'అట్లీస్' అందించిన వివరాల ప్రకారం,కేవలం 36 గంటల వ్యవధిలోనే టర్కీ,అజర్ బైజాన్‌లకు వీసా దరఖాస్తు చేసుకున్న తర్వాత మళ్లీ వెనక్కి తీసుకున్న భారతీయుల సంఖ్య 60 శాతం పెరిగినట్లు నమోదైంది.
వివరాలు
ద్వితీయ శ్రేణి నగరాల నుంచి వీసా దరఖాస్తులు 20 శాతం తగ్గాయి
ముఖ్యంగా ఢిల్లీ,ముంబయి వంటి మెట్రో నగరాల నుండి టర్కీకి పర్యటించేందుకు అప్లై చేసిన వారిలో 53 శాతం మందీ దరఖాస్తులను ఉపసంహరించుకున్నారు.
ఇక ఇండోర్, జైపూర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల నుంచి వీసా దరఖాస్తులు 20 శాతం తగ్గాయి.
ఇంకా కుటుంబాలతో వెళ్లే వారు,గ్రూప్ టూర్స్ కోసం దరఖాస్తు చేసిన వారి సంఖ్యలో 49 శాతం తగ్గుదల కనిపించగా,సింగిల్ టూరిస్టులు,జంటల వీసా అప్లికేషన్లు 27 శాతం పడిపోయాయి.
ఇదే సమయంలో, టర్కీ, అజర్ బైజాన్‌ల స్థానంలో చాలా మంది పర్యాటకులు తమ దృష్టిని థాయ్‌లాండ్, వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాలు,ఈజిప్ట్ వంటి దేశాల వైపు మళ్లించారు.
ఈ దేశాలకు వీసా అప్లికేషన్లు గణనీయంగా పెరిగినట్లు డేటా చెబుతోంది.