ఫలిస్తున్న ఆర్‌బీఐ ఫ్యూహం.. 50 శాతం రూ.2000 నోట్లు వాపస్
2023 మే 19న పెద్ద నోట్ల ఉపసంహరణపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. దేశంలోని ఈ అత్యున్నత బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు ఫలితాలనిస్తున్నాయి. ఈ మేరకు చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో దాదాపుగా 50 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఇలా తమకు తిరిగి వచ్చిన నోట్ల విలువ దాదాపుగా రూ. 1.82 లక్షల కోట్లుగా ఉన్నాయని బ్యాంక్ లెక్కించింది. అయితే ఇందులో 85 శాతం నోట్లు బ్యాంకు డిపాజిట్లుగానే వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. రూ.2000 నోట్లపై ఉపసంహరణను ప్రకటించిన మూడు వారాలలోపే పెద్ద ఎత్తున నోట్లు తమకు చేరాయన్నారు.
సెంట్రల్ బ్యాంక్ వద్ద సరిపడ నిల్వలున్నాయి.. రద్దీ అక్కర్లేదు : ఆర్‌బీఐ
ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు మార్కెట్లో చెలామణిలో ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. సదరు పెద్ద నోట్లను మార్పిడి చేసుకునేందుకు లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు సెప్టెంబరు 30ని తుది గడువుగా గతంలోనే అపెక్స్ బ్యాంక్ స్పష్టం చేసింది. సెప్టెంబర్ చివరి వారంలో రద్దీని నివారించేందుకు సెంట్రల్ బ్యాంక్ వద్ద తగినంత కరెన్సీ కట్టలు అందుబాటులో ఉన్నాయన్నారు. 2018 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న నోట్లలో 37.3 శాతమే లెక్కల్లోకి వచ్చిందని గవర్నర్ అన్నారు. ఈ మేరకు రూ. 6.73 లక్షల కోట్ల నుంచి రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గిపోయిందని గవర్నర్ గుర్తు చేశారు.