Page Loader
8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు అమలవుతుంది? జీతాలు ఎంత పెరుగుతాయి? పూర్తి వివరాలు మీ కోసం.. 
8వ వేతన సంఘం ఎప్పుడు అమలవుతుంది? జీతాలు ఎంత పెరుగుతాయి? పూర్తి వివరాలు మీ కోసం..

8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు అమలవుతుంది? జీతాలు ఎంత పెరుగుతాయి? పూర్తి వివరాలు మీ కోసం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు త్వరలోనే వేతన సవరణలు జరగనున్నాయి. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సంఘం నుండి వచ్చే సిఫార్సులను 2025 చివరి నాటికి ప్రభుత్వం అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సిఫార్సులు ఆమోదం పొందిన తర్వాత,2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వేతన సంఘం కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 50లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. జీతాల్లో 30శాతం నుంచి 34శాతం వరకు పెరుగుదల జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

2016 జనవరి 1 నుంచి 7వవేతన సంఘం సిఫార్సులు అమల్లోకి..

సాధారణంగా కేంద్రం ప్రతి 10సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి,ఉద్యోగుల వేతనాలు,భత్యాలు,పెన్షన్లను పునరుద్ధరించడం పరిపాటి. గతంలో 7వవేతన సంఘం సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 8వ వేతన సంఘం ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల స్పష్టమైన ప్రకటన చేశారు. ఈకమిషన్‌కు సంబంధించిన నియమ నిబంధనలకు త్వరలోనే ఆమోదం లభించనున్నట్లు చెప్పారు. అయితే వాస్తవంగా ఇది ఎప్పటి నుంచి అమలయ్యేది అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. నియమ నిబంధనల ఖరారు,కమిషన్ ప్రభుత్వం వద్దకు సిఫార్సులు పంపడం,ఆమోదం పొందడం వంటి ప్రక్రియలకు గడువు పడే అవకాశముంది. వీటి ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వివరాలు 

జీతాలు 30 నుంచి 34 శాతం వరకు పెరిగే అవకాశం

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం జీతాల పెంపుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, ఉన్న సమాచారం ప్రకారం కనీస ప్రాథమిక వేతనం ప్రస్తుతం ఉన్న రూ. 18,000 నుంచి సుమారు రూ. 51,480 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం మొత్తం జీతాలు 30 నుంచి 34 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. వీటి అమలుకు కేంద్రం సుమారు రూ. 1.8 లక్షల కోట్ల అదనపు ఖర్చు భరించాల్సి వస్తుందని అంచనా. గత వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉన్నప్పటికీ, ఈసారి మరికొంత ఎక్కువగా నిర్ణయించే అవకాశం ఉంది. జీతాలతో పాటు ఉద్యోగులకు డీఏ (కరవు భత్యం) కూడా ప్రధాన భాగం.

వివరాలు 

డీఏ 50శాతం దాటినప్పుడు ప్రాథమిక వేతనంలో విలీనం

డీఏని ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు సవరించే విధానం కొనసాగుతోంది.సాధారణంగా జనవరి,జూలై నెలల నుంచి కొత్త డీఏఅమలయ్యేలా ప్రభుత్వం సవరిస్తుంటుంది. కానీ,ఇది ప్రతిసారి మార్చి,సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ప్రకటించి,ముందుగా జనవరి లేదా జూలై నుంచి అమలులోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతానికి డీఏ శాతం 50ను దాటి ఉంది. కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత,డీఏ మళ్లీ సున్నా శాతం నుంచి ప్రారంభించడానికి అవకాశాలున్నాయి. ఇది బేసిక్ పేలో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.గతంలో కూడా డీఏ 50శాతం దాటినప్పుడు ప్రాథమిక వేతనంలో విలీనం చేసి,మళ్లీ డీఏను సున్నా శాతం నుంచి లెక్కించటం జరిగింది. ఈవిధంగా 8వవేతన సంఘంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జీతాల పెంపుతో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందనున్నారు.