Worlds Best Companies: ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారతీయ సంస్థలకు చోటు.. తొలి స్థానంలో ఏదంటే?
ప్రపంచంలోని అత్యుత్తమ 1000 కంపెనీల జాబితాను టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో భారతదేశానికి చెందిన 22 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితా ''టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024'' పేరిట రిలీజ్ చేసింది. అయితే ఈ జాబితాలో అంబానీ లేదా అదానీ గ్రూప్‌కు చెందిన సంస్థలు అగ్రస్థానంలో ఉంటాయని అనుకున్నవారికి ఆశ్చర్యం కలిగించేట్టుగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ భారతీయ కంపెనీలలో మొదటి స్థానంలో నిలిచింది. టైమ్ మ్యాగజైన్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 112వ ర్యాంక్‌తో భారతదేశపు అగ్రగామి సంస్థగా నిలిచింది.
యాక్సిస్ బ్యాంక్ కు 504 ర్యాంకు
తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్ (119వ ర్యాంక్), విప్రో (134వ ర్యాంక్), మహీంద్రా గ్రూప్ (187వ ర్యాంక్) ఉన్నాయి. భారత బ్యాంకింగ్ విభాగంలో యాక్సిస్ బ్యాంకు 504వ ర్యాంక్‌తో ముందంజలో ఉండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 518వ ర్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 525వ ర్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ 551వ ర్యాంక్ దక్కించుకున్నాయి. భారీ అంచనాలు ఉన్నా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 646వ ర్యాంక్‌కి, అదానీ గ్రూప్ 736వ ర్యాంక్‌కి పరిమితమయ్యాయి. 2023 నాటికి 100 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని కలిగిన సంస్థలు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.