Adani Group: ఓరియంట్ సిమెంట్‌లో 46.8శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్దమైన అదానీ గ్రూప్
గౌతమ్ అదానీ నాయకత్వంలోని అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారంలో తన దూకుడుని కొనసాగిస్తోంది. ఇప్పటికే సిమెంట్ రంగంలో తన బిజినెస్ వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ, తాజాగా మరో కంపెనీలో వాటా కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్‌లో 46.8 శాతం షేర్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో తమ మార్కెట్ వాటాను పెంచుకోవాలని అదానీ గ్రూప్ యోచిస్తోంది. ఇందుకు, సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా అంబుజా ఈ కొనుగోళ్లు చేపట్టనుంది. ఓరియంట్ సిమెంట్‌లో 46.8 శాతం వాటాను పొందడానికి రూ.8,100 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది.
26 శాతం వాటా కోసం ఆఫర్ ఫర్ సేల్
ప్రమోటర్ల నుంచి 37.9 శాతం, పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి అదనంగా 8.9 శాతం కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. మిగిలిన 26 శాతం వాటా కోసం ఆఫర్ ఫర్ సేల్‌కు వెళ్లాలని యోచిస్తోంది. ఈ కొనుగోలుతో 2025 నాటికి వార్షిక ఉత్పత్తి 100 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంబుజా సిమెంట్ డైరెక్టర్ కరణ్ అదానీ ధీమా వ్యక్తం చేశారు.
అదానీ గ్రూప్ ఎంట్రీతో.. గట్టి పోటిని ఎదుర్కుంటున్న అల్ట్రాటెక్ సిమెంట్
అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌లో వాటాల కొనుగోలు ద్వారా సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్ ఇప్పుడు విస్తరణ దిశగా ముందుకు పోతోంది. 2028 ఆర్థిక సంవత్సరానికి దేశీయ సిమెంట్ మార్కెట్‌లో తన షేర్‌ను 20 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. రుణ రహితంగా ఉండాలని నిర్ణయించింది. 2028 నాటికి వార్షిక ఉత్పత్తిని 140 మిలియన్ టన్నులకు చేర్చాలని, వృద్ధితో ముందుకు సాగాలని ప్రణాళికలు రచిస్తోంది. అదానీ గ్రూప్ ఎంట్రీతో సిమెంట్ వ్యాపారంలో ఇప్పటికే ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ గట్టి పోటిని ఎదుర్కొంటోంది.