Page Loader
Adani group: ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. 'హెల్త్‌కేర్‌ టెంపుల్స్‌' ప్రారంభానికి శ్రీకారం
ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. 'హెల్త్‌కేర్‌ టెంపుల్స్‌' ప్రారంభానికి శ్రీకారం

Adani group: ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. 'హెల్త్‌కేర్‌ టెంపుల్స్‌' ప్రారంభానికి శ్రీకారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2025
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ ఆరోగ్య సంరక్షణ రంగంలోకి అడుగుపెట్టారు. తొలుత ముంబయి, అహ్మదాబాద్‌లలో ఒక్కొక్కటి 1000 పడకల సామర్థ్యం గల ఆసుపత్రులను నిర్మించనున్నారు. 'అదానీ హెల్త్‌కేర్‌ టెంపుల్స్‌' పేరిట రానున్న ఈ ఆసుపత్రుల్లో కృత్రిమ మేధ (AI) ఆధారిత సాంకేతికత, ప్రపంచ నాణ్యతా ప్రమాణాలు ఉండనున్నాయని, అందుబాటు ధరల్లో సేవలు అందించనున్నట్లు శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో గౌతమ్‌ అదానీ వెల్లడించారు.

Details

రూ.60,000 కోట్ల సేవా ప్రణాళికలో భాగం

ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సేవలందించేందుకు తన కుటుంబం రూ.60,000 కోట్లు వెచ్చించనుందని గతంలో ప్రకటించిన గౌతమ్‌ అదానీ, ఇప్పుడు ఆ ప్రణాళికను కార్యరూపంలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది ఆయన 60వ జన్మదినోత్సవ సందర్భంగా చేసిన ప్రకటనకు అనుగుణంగా కొనసాగుతున్నదని తెలిపారు. వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది భారతదేశ ఆరోగ్య వ్యవస్థలో వృద్ధి తక్కువగా ఉందని వ్యాఖ్యానించిన అదానీ, ఇందులో ఒక విప్లవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా వేగం అవసరం. ప్రస్తుత నవీకరణలు సరిపోవు, వ్యవస్థ మొత్తాన్ని మార్చాల్సిందేనని స్పష్టం చేశారు.

details

ఏఐ, రోబోటిక్స్‌లో డాక్టర్లకు శిక్షణ 

అహ్మదాబాద్, ముంబయిలలో నిర్మించనున్న ఆసుపత్రులను క్లినికల్‌ కేర్, రీసెర్చ్, అకడమిక్‌ ట్రైనింగ్‌ కోసం 'సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌'గా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో డాక్టర్లకు కేవలం వైద్య విద్యే కాకుండా, రోబోటిక్స్, కృత్రిమ మేధ (AI), సిస్టమ్స్‌ థింకింగ్, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లోనూ శిక్షణ ఇచ్చేలా చూస్తామన్నారు.

Details

వైద్యుల లోపం - గ్రామీణ సేవల సమస్య

గౌతమ్‌ అదానీ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో ప్రతి 10,000 మందికి సగటున కేవలం 20.6 మంది డాక్టర్లు, నర్సులే ఉన్నారు, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన 44.5 మందికి కంటే చాలా తక్కువ. పైగా, అందుబాటులో ఉన్న వైద్యుల్లో 74 శాతం మంది పట్టణాల్లోనే పనిచేస్తుండటంతో, గ్రామీణ ప్రాంతాలకు తగిన సేవలు అందటం లేదు. ఈ లోపాలను భర్తీ చేయాలంటే, దేశ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవాలంటే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పూర్తిగా రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందని అదానీ అభిప్రాయపడ్డారు. మొత్తంగా, దేశ ఆరోగ్య రంగానికి ఒక కొత్త దిశనిచ్చేలా అదానీ గ్రూప్‌ అడుగులు వేస్తుండడం, అనేక రంగాలలో సమీకృత అభివృద్ధికి దోహదం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.