Adani group: అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూపు
తమపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్ (Adani Group), సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇచ్చారన్న అభియోగాలను పూర్తిగా నిరాకరించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ, తమ గ్రూపు అన్ని చట్టాలకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై న్యాయపరంగా ముందడుగు వేయడం పరిగణనలో ఉందని తెలిపింది. సోలార్ ప్రాజెక్టులను పొందడంలో భాగంగా అదానీ గ్రూప్ భారత ప్రభుత్వ అధికారులకు రూ. 2,100 కోట్లు లంచం ఇచ్చిందన్న ఆరోపణలతో పాటు, ఇన్వెస్టర్లకు తప్పుదోవ పట్టించారని అమెరికాలో కేసులు నమోదయ్యాయి.
అదానీ వ్యవహారంపై రాజకీయ దుమారం
గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదైనట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ స్టాక్స్ విలువ గణనీయంగా పడిపోయాయి. ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపి, కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ ప్రతినిధులు స్పందిస్తూ, అవి కేవలం నేరారోపణలేనని, దోషిత్వం రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగా భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ ప్రతిసారీ అత్యున్నత పాలనా ప్రమాణాలు పాటిస్తుందని, పారదర్శకతకు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. తమ కార్యకలాపాలు నిర్వహించే ప్రతి ప్రదేశంలో చట్టాల పట్ల గౌరవంతో నడుచుకుంటున్నామని, వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు.