Adani Group: స్విస్ ఖాతాలను జప్తు.. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ కంపెనీ ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా, ఆ గ్రూప్‌కు సంబంధించి 310 మిలియన్ డాలర్ల స్విస్ ఖాతాలను స్విస్ ప్రభుత్వం జప్తు చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ అసత్యాలు, నిరాధార లేని వార్తలని పేర్కొంది. కుట్రపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టింది. అదానీ గ్రూప్‌కు సంబంధమున్న అనేక కంపెనీలపై మనీలాండరింగ్ దర్యాప్తు జరుగుతున్న సమయంలో, ఆరు స్విస్ ఖాతాల్లోని 310 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,600 కోట్లు) జప్తు చేసిందని స్విస్ వార్తా సంస్థ 'గోథమ్ సిటీ' వెల్లడించింది.
పన్ను తక్కువగా ఉండే దేశాల్లోని ఆఫ్‌షోర్ ఫండ్‌లలో ఆర్థిక అవకతవకలు
ఈ కథనానికి సంబంధించిన లింక్‌ను హిండెన్‌బర్గ్ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. బీవీఐ, మారిషస్, బెర్ముడా వంటి పన్ను తక్కువగా ఉండే దేశాల్లోని ఆఫ్‌షోర్ ఫండ్‌లలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఈ సంస్థలు 2021లో అదానీ షేర్లలో పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తు ద్వారా తెలుసుకున్నారని హిండెన్‌బర్గ్ పేర్కొంది. అదానీ గ్రూప్ ప్రతినిధి ఆ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం, స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డుల్లో ఈ విషయాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది, ఈ ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి.
ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్
ఈ ఆరోపణలపై స్పందిస్తూ, అదానీ గ్రూప్ అధికారిక ప్రకటన చేసింది."ఆ ఆరోపణలను పూర్తిగా తిరస్కరిస్తున్నాం. అదానీ గ్రూప్ ఏ స్విస్ కోర్టు విచారణను ఎదుర్కొంటున్నది లేదు,మా కంపెనీ ఖాతాలపై ఎటువంటి న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోబడలేదు.కథనంలో పేర్కొన్న ఉత్తర్వుల్లో మా కంపెనీల గురించి స్విస్ కోర్టు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంకా, మా ఖాతాలకు సంబంధించిన ఎలాంటి నోటీసులు మాకు రాలేదు. మా విదేశీ ఖాతాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయి, చట్టాల ప్రకారం వాటిని నిర్వహిస్తున్నాం" అని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు అసంబద్ధం,అహేతుకమైనవి అని అదానీ గ్రూప్ పేర్కొంది.ఇవి కేవలం తమ కంపెనీ పరువును దెబ్బతీయడానికి,మార్కెట్‌లో గణనీయమైన నష్టాన్ని కలిగించడానికి కావాలని చేస్తున్న కుట్ర అని గ్రూప్ వెల్లడించింది.