Page Loader
Air india Flight Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం.. భారీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం..
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం.. భారీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం..

Air india Flight Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం.. భారీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఉదయం టేకాఫ్‌ అయిన వెంటనే కుప్పకూలిన దుర్ఘటన, భారతీయ విమానయాన చరిత్రలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా అత్యంత దారుణమైన ఘటనగా పరిగణించబడింది. ఈ విషాద ఘటనలో 242 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క వ్యక్తిని మినహ మిగిలిన వారంతా మరణించారు. విమానం మెడికల్ హాస్టల్ భవనంపై పడిపోవడం వల్ల ఆ హాస్టల్లో ఉన్న 24 మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 265 మంది ఈ ప్రమాదంలో మరణించినట్టు అధికారికంగా ధృవీకరించారు.

వివరాలు 

బీమా చరిత్రలో అత్యధిక విలువగల క్లెయిమ్

ఈ ప్రమాదం నేపథ్యంలో ఇప్పుడు విమాన బీమా,ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఇది భారతదేశ బీమా చరిత్రలో అత్యధిక విలువగల క్లెయిమ్ అవుతుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం,ఈ ప్రమాదం వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టం సుమారు 211 మిలియన్ డాలర్లు నుంచి 280 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత రూపాయలలో ఇది సుమారు రూ. 2,400 కోట్లు అవుతుంది.

వివరాలు 

బీమా క్లెయిమ్ విమానం వయస్సు, మోడల్, డిజైన్ వంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు

ఈ సందర్భంలో ప్రభుత్వ రంగ రీ-ఇన్సూరెన్స్ సంస్థ అయిన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామస్వామి నారాయణన్ మాట్లాడుతూ, విమాన సంస్థలు తీసుకునే ఫ్లీట్ ఇన్సూరెన్స్ పాలసీలో సాధారణంగా విమానాలు, వాటి విడి భాగాలు, ప్రయాణికుల ప్రాణనష్టం, అలాగే మూడవ పక్షానికి జరిగే నష్టాలు కూడా కవర్ అవుతాయని చెప్పారు. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించగా, విమానం పూర్తిగా ధ్వంసమైంది. అందుకే ఈ బీమా క్లెయిమ్ విమానం వయస్సు, మోడల్, డిజైన్ వంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రయాణికులకు ఇచ్చే పరిహారం 1999 మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం లెక్కించబడుతుంది. భారతదేశం 2009లో ఈ కన్వెన్షన్‌పై సంతకం చేసింది.

వివరాలు 

పరిహారం "స్పెషల్ డ్రాయింగ్ రైట్స్" పద్ధతిలో లెక్కిస్తారు

ఈ పరిహారం "స్పెషల్ డ్రాయింగ్ రైట్స్" (SDRs) పద్ధతిలో లెక్కిస్తారు. ప్రస్తుత విలువ ప్రకారం, ఒక ప్రయాణికునికి 1,28,821 SDRలు అంటే దాదాపు 1.71 లక్షల అమెరికన్ డాలర్లు, భారత రూపాయలలో సుమారు రూ. 1.47 కోట్లు పరిహారంగా లభించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు, విమాన ప్రమాదం వలన మూడో పక్షాలకు (Third Party) జరిగిన నష్టాలను కూడా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఉదాహరణకు, భవనం మీద పడిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన మెడికల్ విద్యార్థుల మరణం కూడా దీనిలో భాగమవుతుంది. ఇప్పటికే టాటా గ్రూప్, ఈ ప్రమాదంలో మరణించిన ప్రతి ప్రయాణికుడి కుటుంబానికి రూ. 1 కోటి చొప్పున పరిహారం ప్రకటించింది.