LOADING...
Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ షాక్.. 50 చోట్ల కొనసాగుతోన్న సోదాలు
అనిల్ అంబానీకి ఈడీ షాక్.. 50 చోట్ల కొనసాగుతోన్న సోదాలు

Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ షాక్.. 50 చోట్ల కొనసాగుతోన్న సోదాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (RAADA) సంస్థలకు సంబంధించి,ఈడీ ముంబై, ఢిల్లీ నగరాల్లోని పలు కార్యాలయాలు,నివాస ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 50 ప్రాంతాల్లో ఒకేసారి ఈ సోదాలు చేపట్టడం కలకలం రేపింది. ఇవి గురువారం ఉదయం నుంచే ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఇటీవ‌ల,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అనిల్ అంబానీ కంపెనీ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) తీసుకున్న రుణాలను మోసపూరితమైనవిగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో,ప్రస్తుతం జరుపుతున్న ఈడీ సోదాలు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించినవిగా సమాచారం అందుతోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను ఆధారంగా తీసుకొని ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది.

వివరాలు 

సెబీ అనిల్ అంబానీపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు 

ఈ దర్యాప్తులో, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు అనుబంధ సంస్థలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అంతేకాక, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ),సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వంటి ఇతర సంస్థల నుంచి కూడా అనిల్ అంబానీతో సంబంధిత మోసాలకు సంబంధించిన సమాచారాన్ని ఈడీకి అందించారు. దీంతో ఈ దాడులకు మరింత ప్రాధాన్యత లభించింది. ఇక అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంతో పాటు వివిధ న్యాయసమస్యలను ఎదుర్కొంటోంది. 2024 ఆగస్టులో, సెబీ అనిల్ అంబానీపై నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (RHFL) కేసులో ఆయనను ఐదేళ్లపాటు సెక్యూరిటీస్ మార్కెట్ కార్యకలాపాల నుండి నిషేధించింది.

వివరాలు 

 24 సంస్థలపై రూ.25 కోట్ల జరిమానా 

అనిల్ అంబానీతో పాటు మొత్తం 24 సంస్థలపై రూ.25 కోట్ల జరిమానా విధించగా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థపై కూడా ఆరు నెలల నిషేధం అమలు చేయడంతోపాటు రూ.6 లక్షల జరిమానా విధించింది. సెబీ దర్యాప్తులో, అనిల్ అంబానీ తన ఆధీనంలో ఉన్న సంస్థల నిధులను సంబంధిత ఇతర కంపెనీలకు రుణాలుగా మళ్లించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనిల్ అంబానీ ఆఫీసుల్లో ఈడీ సోదాలు