Page Loader
Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్నులకు సిద్ధంగా ఉన్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులకు సిద్ధంగా ఉన్నారా?

Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్నులకు సిద్ధంగా ఉన్నారా?

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతన ఐటీఆర్‌ ఫారాల విడుదల చేపట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పొందిన ఆదాయానికి సంబంధించి, 2025-26 మదింపు సంవత్సరంలో రిటర్నులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు ఏ రకం ఐటీఆర్‌ ఫారాన్ని ఉపయోగించాలో తెలుసుకోవడం అవసరం. ప్రతి ఫారం కోసం స్పష్టమైన మార్గదర్శకాలు ఆదాయం వచ్చే మార్గాన్ని బట్టి, ఏ ఫారాన్ని ఎవరికి వర్తించాలో ఆదాయపు పన్ను శాఖ (ఇన్‌కమ్‌ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌) సవివరంగా పేర్కొంది. వాటిని విభాగాల వారీగా పరిశీలిద్దాం:

వివరాలు 

ఐటీఆర్‌-1 (సహజ్‌): 

ఈ ఫారం వేతనదారులకు, ఒక ఇంటి ఆస్తి ద్వారా ఆదాయం పొందేవారికి, అలాగే ఇతర మూలాల నుండి ఆదాయం (బ్యాంకు వడ్డీ, డివిడెండ్లు వంటి) పొందే వారికి వర్తిస్తుంది. వారి మొత్తం ఆదాయం రూ.50 లక్షలకు మించకూడదు. సెక్షన్‌ 112ఏ ప్రకారం దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.1.25 లక్షల వరకు ఉన్నవారు దీనిని ఉపయోగించవచ్చు. గత సంవత్సరాల నష్టాలను ఈ సంవత్సరానికి తరలించి సర్దుబాటు చేయదలుచుకోనివారు ఈ ఫారాన్ని ఉపయోగించవచ్చు. అయితే వ్యాపార ఆదాయం ఉన్నవారు, విదేశీ ఆస్తులు కలిగినవారు, రెండు కంటే ఎక్కువ ఇళ్ల ఆదాయం కలిగినవారికి ఈ ఫారం వర్తించదు.

వివరాలు 

ఐటీఆర్‌-2: 

రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs), రెండు కంటే ఎక్కువ ఇళ్ల ఆదాయం ఉన్నవారు దీనిని వాడవచ్చు. మూలధన లాభాలు లేదా నష్టాలు ఉన్నవారు, విదేశాల్లోని ఆస్తులు లేదా ఆదాయం ఉన్నవారికి ఇది అనుకూలం. అయితే వ్యాపార లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్నవారికి ఈ ఫారం వర్తించదు. ఐటీఆర్‌-3: వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న వ్యక్తులు మరియు హెచ్‌యూఎఫ్‌లకు ఇది వర్తిస్తుంది. ఈ ఫారంలో కూడా ఐటీఆర్‌-2లో ఉన్నట్లే మూలధన లాభాల షెడ్యూల్‌ ఉంటుంది.

వివరాలు 

ఐటీఆర్‌-4 (సుగమ్‌): 

వ్యాపార లేదా వృత్తి ఆధారిత ఆదాయం రూ.50 లక్షల లోపు ఉన్నవారు (పన్ను ఆడిట్ అవసరం లేని వారు) దీనిని ఉపయోగించవచ్చు. అలాగే వేతనదారులు, ఒక ఇంటి ఆస్తి ద్వారా ఆదాయం పొందేవారికి ఇది వర్తిస్తుంది. మూలధన లాభాల విషయంలో ఐటీఆర్‌-1లో ఉన్న నిబంధనలు దీనికీ వర్తిస్తాయి. ఐటీఆర్‌-5: భాగస్వామ్య సంస్థలు (పార్ట్నర్‌షిప్ ఫర్ములు), ఎల్ఎల్‌పీలు (లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్స్), సహకార సంఘాలు, ఇతర సంఘాల కోసం ఈ ఫారం ఉపయోగించవచ్చు. ఇందులో ఉన్న మూలధన లాభాల షెడ్యూల్‌ ఐటీఆర్‌-2, ఐటీఆర్‌-3లతో సమానంగా ఉంటుంది.

వివరాలు 

ఐటీఆర్‌-6: 

పన్ను ఆడిట్ అవసరం లేని కంపెనీల కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో కూడా ఇతర ఫారాల మాదిరిగానే మూలధన లాభాల షెడ్యూల్‌ ఉంటుంది. ఐటీఆర్‌-7: ట్రస్టులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర నిర్దిష్ట విధుల కోసం పనిచేసే సంస్థల కోసం ఈ ఫారం రూపొందించబడింది.

వివరాలు 

నిపుణుల సూచనలు: 

వేతనం, వడ్డీ వంటి సాధారణ ఆదాయ మూలాలు ఉన్నవారు ఐటీఆర్‌ రిటర్నులను తామే సులభంగా దాఖలు చేసుకోవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు, ఆస్తుల కొనుగోలు-అమ్మకాలు, మూలధన లాభాలు వంటి అంశాలు ఉన్నప్పుడు పన్ను నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. సరైన ఫారం ఎంచుకోకపోతే, రిటర్న్ తిరస్కరణకు గురవవచ్చు. జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటీవల అమలులోకి వచ్చిన కొత్త మూలధన లాభాల షెడ్యూల్‌ కారణంగా జాగ్రత్తగా ఫారం ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వివరాలు 

రిటర్నుల సమర్పణకు గడువు - జులై 31, 2025: 

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలంటే అధికారిక వెబ్‌సైట్‌ www.incometax.gov.inకి లాగిన్‌ అవ్వాలి. అక్కడ అవసరమైన పత్రాలు, మీకు వర్తించే ఫారం వివరాలన్నీ పొందుపరచబడి ఉంటాయి. పన్ను ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31, 2025 లోపు రిటర్నులు దాఖలు చేయాలి. ఈ గడువు మించిపోయిన తర్వాత ఆలస్య రుసుముతో మాత్రమే రిటర్న్‌ సమర్పణ సాధ్యమవుతుంది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి: ఐటీఆర్‌ ఫైలు చేయాలనుకునే వారు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానించి ఉండాల్సిందే. ఇది ఇప్పుడు తప్పనిసరి. గతంలో ఆధార్‌ నమోదు ఐడీ (Enrolment ID) చెప్పినా సరిపోయేది. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. కచ్చితంగా ఆధార్‌ నంబరును సమర్పించాల్సిందే. రిటర్న్ ఫారాల రూపకల్పనలో కూడా ఈ మార్పు అనుసరించబడింది.