Retail inflation: భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణంలో భారీ క్షీణత.. జనవరిలో 4.31శాతానికి తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. డిసెంబర్‌లో 5.22%గా ఉన్న ద్రవ్యోల్బణం, జనవరిలో 4.31%కు పడిపోయింది.
ముఖ్యంగా ఆహార ధరల పెరుగుదల మందగించడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక నిపుణులు అంచనా వేసిన కన్నా ఎక్కువగా ఈ తగ్గుదల కనిపించింది.
రాయిటర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం, జనవరి ద్రవ్యోల్బణం 4.6% ఉంటుందని అంచనా వేసినా అది 4.31%కి పడిపోవడం విశేషం.
రూరల్, అర్బన్ ద్రవ్యోల్బణ స్థాయిలు
గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5.76%గా ఉండగా, జనవరిలో 4.64%కి తగ్గింది.
నగర ప్రాంతాల్లో డిసెంబర్‌లో 4.58%గా ఉన్న ద్రవ్యోల్బణం, జనవరిలో 3.87%కి తగ్గింది.
Details
సాధారణ ప్రజలకు ఊరట
ద్రవ్యోల్బణం తగ్గడం దేశంలోని కోట్లాది మంది కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించనుంది. రోజువారీ ఖర్చుల్లో ముఖ్యంగా ఆహారపు సామాగ్రి ధరలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి.
ఈ తగ్గుదల కారణంగా కుటుంబాలపై ఆర్థిక భారం కొంత మేర తగ్గనుంది.
ఆర్బీఐ నిర్ణయంపై ప్రభావం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గడం, ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడం ఆర్బీఐకు సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.
గతేడాది అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి అయిన 6.2శాతాన్ని తాకింది. అదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం 10.9శాతానికి పెరిగి 15 నెలల గరిష్ట స్థాయిని చేరింది.
Details
ఆహార ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు
దేశీయ మార్కెట్లలో తాజా శీతాకాల పంటలు అందుబాటులోకి రావడం ఆహార ధరల పెరుగుదలను నియంత్రించిందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కూరగాయల ధరలు గణనీయంగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.
ANZ రీసెర్చ్‌కు చెందిన ధీరజ్ నిమ్ మాట్లాడుతూ తాజా పంటలు మార్కెట్లోకి రావడంతో జనవరిలో కూరగాయల ధరలు స్పష్టంగా తగ్గాయని తెలిపారు.
ద్రవ్యోల్బణం తగ్గడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆర్ బి ఐ కు మరింత అవకాశం ఇచ్చేలా ఉంది.
అయితే ఇది తమ దీర్ఘకాలిక లక్ష్యమైన 4శాతం ద్రవ్యోల్బణ స్థాయికి ఇంకా కొంత ఎక్కువగానే ఉన్నందున భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక విధాన మార్పులను RBI పరిశీలించే అవకాశముంది.