
Pakistan: ఉద్రిక్తతలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం.. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో కొనసాగుతున్నఉద్రిక్తతలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశముందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ హెచ్చరించింది.
భారత్‌తో పోల్చితే పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం కలగనుందని ఈ సంస్థ విశ్లేషించింది.
ఆదేశ వృద్ధిరేటు తగ్గే అవకాశముండటంతో పాటు,ప్రభుత్వానికి అవసరమైన నిధులను సమీకరించడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
పాకిస్తాన్‌కు బాహ్యంగా అప్పులు పొందే అవకాశాలు తగ్గిపోతుండటంతో పాటు,ఇప్పటికే ఆ దేశం వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు తక్కువవుతూ పోతున్నాయని మూడీస్ హెచ్చరించింది.
ఉన్నన్ని విదేశీ మారకద్రవ్యాలు కూడా అప్పుల రీపేమెంట్‌కు సరిపోవని స్పష్టం చేసింది.
ఇలాంటి ఆర్థిక సమస్యల మధ్య ఉన్నా కూడా పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) విధించిన నిబంధనలను పాటించాల్సిన అవసరం తప్పదని పేర్కొంది.
వివరాలు
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోంది
ఇదిలా ఉండగా, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోందని, స్థిరమైన వృద్ధి రేటును సాధిస్తోందని మూడీస్ అభిప్రాయపడింది.
కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చులు నాణ్యంగా ఉండటంతో పాటు, దేశ ప్రజల వినియోగ శక్తి కూడా మెరుగ్గా కొనసాగుతోందని వివరించింది.
ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది.
''భారత ఆర్థిక కార్యకలాపాలు అంతగా అంతరాయం కలగకుండా కొనసాగుతాయని మేము భావిస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం భారత్‌కు పాకిస్తాన్‌తో ఉన్న ఆర్థిక సంబంధాలు అత్యంత తక్కువ స్థాయిలో ఉండటమే. మొత్తం భారత ఎగుమతుల్లో కేవలం 0.5 శాతం మాత్రమే ఇస్లామాబాద్ కే వెళ్తున్నాయి,'' అని మూడీస్ పేర్కొంది.
వివరాలు
భారత్, పాకిస్తాన్ సంబంధాలు అత్యంత దిగజారిన స్థాయికి..
జియోపొలిటికల్ దృష్టికోణంలోనూ భారత్, పాకిస్తాన్ మధ్య పరిమిత స్థాయిలోనే సైనిక ప్రతిస్పందనలు జరిగే అవకాశముందని మూడీస్ అంచనా వేసింది.
కాలానుగుణంగా ఇటువంటి ఉద్రిక్తతలు ఉధృతమయ్యే అవకాశమున్నా, అవి పెద్ద ఎత్తున యుద్ధానికి దారితీయవని స్పష్టంగా తెలిపింది.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులు పలు మార్లు చోటు చేసుకున్నాయని గుర్తు చేసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలు అత్యంత దిగజారిన స్థాయికి చేరాయని పేర్కొంది.
పరస్పర పోర్టులకు నౌకా రాకపోకలను నిషేధించడమే కాకుండా, వాణిజ్య సంబంధాలైన ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిపివేశాయని వివరించింది.