
Boycott Turkey: 'బాయ్‌కాట్ టర్కీ' ఎఫెక్ట్.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్ సంస్థలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ సందర్భంలో పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన తుర్కియే,అజర్‌బైజాన్ దేశాలపై భారతదేశంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు, ట్రావెల్ ఏజెన్సీలు స్పందిస్తున్న తీరు మరింత ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా, ఈ రెండు దేశాలకు ఆన్‌లైన్ బుకింగ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రముఖ ట్రావెల్ సంస్థలు ప్రకటించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, తాజా బుకింగ్‌లు దాదాపు 60 శాతం తగ్గిపోయినట్టు, క్యాన్సలేషన్‌లు 250 శాతం పెరిగినట్టు ప్రముఖ ట్రావెల్ పోర్టల్ 'మేక్‌మైట్రిప్' వెల్లడించింది.
వివరాలు
ఈ నిర్ణయాన్ని మేమూ గౌరవిస్తున్నాం
"తుర్కియే, అజర్‌బైజాన్‌లను బహిష్కరించాలన్న నినాదం గత వారం రోజులుగా స్పష్టంగా ప్రభావం చూపిస్తోంది. ఈ రెండు దేశాలకు సంబంధించి కొత్త బుకింగ్‌లు 60 శాతం తగ్గగా, ఇప్పటికే బుక్ చేసుకున్న పర్యటనలను రద్దు చేసుకునే వారి సంఖ్య 250 శాతానికి చేరింది. భారతదేశంతో సంఘీభావంగా, మన భద్రతా బలగాల పట్ల గౌరవంతో పర్యాటకులు తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని మేమూ గౌరవిస్తున్నాం. ప్రస్తుతం అత్యవసర ప్రయాణాలు తప్ప ఇతర బుకింగ్‌లు నిరుత్సాహపరుస్తున్నాం" అని మేక్‌మైట్రిప్ ప్రకటించింది.
వివరాలు
'ఈజీమైట్రిప్' కూడా ఇదే తరహాలో చర్యలు
ఇక మరో ప్రముఖ ట్రావెల్ కంపెనీ 'ఈజీమైట్రిప్' కూడా ఇదే తరహాలో చర్యలు తీసుకుంది.
గత వారం రోజుల గణాంకాల ప్రకారం, తుర్కియేకు 22 శాతం క్యాన్సలేషన్‌లు, అజర్‌బైజాన్‌కు 30 శాతం క్యాన్సలేషన్‌లు నమోదైనట్లు సంస్థ వివరించింది.
ఇప్పటికే బుక్ అయిన ప్యాకేజీలను రద్దు చేయవద్దని తామన్నప్పటికీ, పర్యాటకులు స్వచ్ఛందంగా ఆ దేశాలకు ప్రయాణించేందుకు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది.