Page Loader
Adani: సోలార్‌ కాంట్రాక్టుల కోసం లంచం..? అదానీపై అమెరికాలో క్రిమినల్‌ కేసు!
సోలార్‌ కాంట్రాక్టుల కోసం లంచం..? అదానీపై అమెరికాలో క్రిమినల్‌ కేసు!

Adani: సోలార్‌ కాంట్రాక్టుల కోసం లంచం..? అదానీపై అమెరికాలో క్రిమినల్‌ కేసు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2024
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతమ్‌ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్‌కు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ సమన్లు జారీ చేసింది. సోలార్‌ ఎనర్జీ కాంట్రాక్టుల కోసం భారతీయ అధికారులకు 265 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2,200 కోట్లు) లంచం ఇచ్చారన్న ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని ఈ సమన్లలో కోరింది. ఈ కేసులో న్యూయార్క్‌ ఈస్ట్రన్‌ కోర్టు నవంబర్‌ 21న గౌతమ్‌ అదానీ అహ్మదాబాద్‌ నివాసం (శాంతివన్‌ ఫామ్‌)తో పాటు సాగర్‌ నివాసానికి నోటీసులు పంపింది. 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా సూచించింది. విదేశీ లంచం, సెక్యూరిటీల మోసం, వైర్‌ ఫ్రాడ్‌ వంటి క్రిమినల్‌ అభియోగాలు అదానీపై నమోదయ్యాయని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

Details

అరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్

ఇరు దశాబ్దాల్లో రెండు బిలియన్‌ డాలర్ల విలువైన సోలార్‌ ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందడానికి అదానీ గ్రూప్‌ భారత అధికారులకు 250 మిలియన్‌ డాలర్లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. అయితే అదానీ గ్రూప్‌ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. తమ కంపెనీ కార్యకలాపాలు పారదర్శకతతో సాగుతాయని, చట్టాలు, నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని అదానీ గ్రూప్‌ స్పష్టం చేసింది. అమెరికన్‌ ఇన్వెస్టర్లను మోసం చేయడమే కాకుండా, అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా గౌతమ్‌ అదానీ సెక్యూరిటీస్‌ చట్టాన్ని ఉల్లంఘించారని SEC అభియోగాలు మోపింది. ఈ కేసు పరిణామాలు అదానీ గ్రూప్‌పై అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది.