
సిబ్బందికి బోనస్ చెల్లించని బైజూస్.. హామీల అమల్లో ఫెయిలైన కంపెనీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ మరోసారి వార్తల్లో నిలిచింది. ట్యూషన్ టీచింగ్ స్టాఫ్ కోసం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల (PERFORMANCE LINKED INCENTIVES)ను చెల్లించడంలో విఫలమైంది.
ఈ మేరకు బోధనా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
2022 సెప్టెంబర్ నుంచి నేటి వరకు, అంటే సరిగ్గా ఏడాదికి సంబంధించిన ప్రత్యేక బోనస్ (SPECIAL INCENTIVES)ను ఇవ్వడంలో విఫలమైంది.
ఈ నెల జీతాలతో వేరియబుల్ ఇన్సెంటివ్‌లతో పాటు ఇతర ఇన్సెంటివ్‌లను సైతం చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, కంపెనీ తన మాటను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది.
అయితే సదరు బోనస్ లను అందించే అంశంపై ఇప్పటికీ యాజమాన్యం నుంచి ఉద్యోగులకు ఎటువంటి సమాచారం అందలేదని సమాచారం.
DETAILS
బకాయిలు చెల్లించేందుకు కట్టుబడి ఉన్నాం: బైజూస్
గతేడాది సెప్టెంబర్ నుంచి BYJUS తన ట్యూషన్ సెంటర్ ఉద్యోగులకు పనితీరు ఆధారిత వేతనాన్ని అందించలేదని ఏడుగురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
తొలుత 2023 మేలో బోనస్ పంపిణీ చేసేందుకు కంపెనీ అంగీకరించిందని, కానీ తన హామీని నిలబెట్టుకోలేకపోయిందని వాపోతున్నారు.
మరోవైపు చెల్లింపులపై మేనేజర్‌లను,హెచ్‌ఆర్ నుంచి సమాచారం కోసం ఉద్యోగులు ఆరా తీస్తున్నారు.గత జులైలో బైజూస్ బెంగళూరులోని అతిపెద్ద కార్యాలయ స్థలాన్ని సైతం అప్పుల ఊబిలో వదులుకోవాల్సి వచ్చింది.
ఈ మేరకు సిబ్బందిని తగ్గించుకుని తనను తాను పునర్నిర్మించుకునేందుకు సంస్థ చర్యలు చేపట్టింది.
బకాయిలను తీర్చేందుకు బైజూస్ కొత్త హెచ్‌ఆర్ హెడ్‌గా ఇన్ఫోసిస్ నుంచి రిచర్డ్ లోబోను నియమించింది. బకాయిలను చెల్లించేందుకు కంపెనీ కట్టుబడి ఉన్నట్లు బైజూస్ ప్రకటించడం గమనార్హం.