కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం
కొత్త ప్రత్యక్ష పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిని ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తీసుకుంటుంది. దేశంలోని మధ్యతరగతి ప్రజలు రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతారని, తమకు కొంత ఉపశమనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాను మధ్యతరగతికి చెందినవారని వారి ఆర్థిక ఒత్తిడిని అర్థం చేసుకుంటానని పేర్కొన్నారు. కొత్త విధానం ఇంటి అద్దె, బీమాపై మినహాయింపులను పరిగణలోకి తీసుకోకపోవడం వలన అంత ఆకర్షణీయంగా లేదని నిపుణులు అంటున్నారు.
పన్ను పరిమితిని 20 లక్షలకు పెంచాలని నిపుణులు కోరుతున్నారు
ప్రస్తుతం, రూ. 2.5-5 లక్షల ఆదాయంపై 5% పన్ను విధిస్తుండగా, రూ. 5-7.5 లక్షలు 10%పన్ను, రూ. 7.5-10 లక్షలకు 15% పన్ను, రూ. 10-12.5 లక్షలు 20%, రూ. 12.5-15 లక్షలు 25%, వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు ఆపైన 30%. ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో, రూ. 5-7.5 లక్షలకు 10% పన్ను విధిస్తున్నారు. అయితే ఇది పాత పన్ను విధానంలో 20%. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఇతర పన్ను ఆదా పథకాలలో పెట్టుబడులకు తగ్గింపులను ఈ కొత్త పన్ను విధానాలను అనుమతించాలని నిపుణులు అంటున్నారు. 30% పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 15లక్షల నుంచి 20లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.