UPI, RuPay Transactions: యూపీఐ, రూపే లావాదేవీలపై ఛార్జీలు.. వ్యాపారులపై కొత్త భారం?
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో చేసే లావాదేవీలపై వ్యాపారుల నుంచి మర్చెంట్ ఛార్జీలను (Merchant Charges) వసూలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు, కానీ త్వరలోనే పెద్ద వ్యాపారులు యూపీఐ చెల్లింపులకు ఎండీఆర్ (MDR) చెల్లించాల్సి రావొచ్చని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వార్షిక ఆదాయం రూ.40 లక్షలకు మించే వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు మర్చెంట్ ఛార్జీలు చెల్లించే విధానాన్ని తిరిగి అమలు చేయాలని బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కేంద్రానికి ప్రతిపాదించారని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Details
లావాదేవీలను ప్రోత్సహించేందుకు నిర్ణయం
వీసా, మాస్టర్‌కార్డ్ వంటి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల లావాదేవీలకు పెద్ద వ్యాపారులు ఎండీఆర్ ఛార్జీలు చెల్లిస్తుంటే, యూపీఐ, రూపే డెబిట్ కార్డులకు కూడా అటువంటి ఛార్జీలు ఉండాలని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కేంద్రం 'టైర్డ్ ప్రైజింగ్ సిస్టమ్'ను అనుసరించి, చిన్న వ్యాపారులను రుసుముల నుంచి మినహాయిస్తూ, రూ.40 లక్షలలోపు వార్షిక ఆదాయమున్న వ్యాపారులు యూపీఐ చెల్లింపులను ఉచితంగానే కొనసాగించగలిగేలా ప్రణాళిక రూపొందిస్తోందని తెలుస్తోంది.
ఈ మార్పులు వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదన్న నిర్ణయం ప్రభుత్వానిది.
అయితే వ్యాపారులు లావాదేవీలపై ఛార్జీలు చెల్లించాల్సి వస్తే, తిరిగి నగదు లావాదేవీలను ప్రోత్సహించే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Details
ఎండీఆర్ ఛార్జీలను గతంలో తొలగించిన కేంద్రం
2022కు ముందు వరకు, యూపీఐ లావాదేవీలకు వ్యాపారులు బ్యాంకులకు ఎండీఆర్ ఛార్జీలు చెల్లించేవారు. అయితే 2022లో కేంద్రం ఈ ఛార్జీలను తొలగించింది.
ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేసేందుకు బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీలు అందించింది.
కానీ 2024 బడ్జెట్‌లో ఈ సబ్సిడీని రూ.3500 కోట్ల నుంచి రూ.437 కోట్లకు తగ్గించడంతో, బ్యాంకులు తిరిగి ఎండీఆర్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది.