Page Loader
China: వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అమెరికాపై 'కఠిన చర్యలు' తీసుకుంటామని చైనా ప్రతిజ్ఞ 
వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అమెరికాపై 'కఠిన చర్యలు' తీసుకుంటామని చైనా ప్రతిజ్ఞ

China: వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అమెరికాపై 'కఠిన చర్యలు' తీసుకుంటామని చైనా ప్రతిజ్ఞ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

జెనీవాలో జరిగిన వాణిజ్య చర్చల్లో సాధించిన సమగ్ర అవగాహనను తమ ప్రభుత్వం తుది వరుస వరకు అమలు చేసిందని చెబుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా ఖండించింది. ట్రంప్ ఆరోపణలను పూర్తిగా నిరాధారమైనవిగా అభివర్ణిస్తూ, అవి అసత్యంగా, రాజకీయ ఉద్దేశాలతో చేసిన వ్యాఖ్యలని చైనా పేర్కొంది. అంతేకాకుండా, తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైతే కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించింది.

వివరాలు 

తరచుగా వాణిజ్య ఘర్షణలకు కారణమవుతున్న అమెరికా 

చైనా జెనీవా వేదికగా జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసింది అని స్పష్టం చేసింది. అయితే, అమెరికా మాత్రం చైనాపై వివక్షత చూపుతూ పలు ఆంక్షలు విధించిందని ఆరోపించింది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చిప్‌లపై ఆంక్షలు, చిప్ డిజైన్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ల అమ్మకాలను నిరోధించడం, చైనా విద్యార్థుల వీసాల రద్దు వంటి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ''అమెరికా సజావుగా సాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఉద్దేశపూర్వకంగా అస్థిరతపాలు చేస్తోంది. తరచుగా వాణిజ్య ఘర్షణలకు కారణమవుతోంది'' అంటూ చైనా వాణిజ్య శాఖ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే, తమ వైపు నుంచి ఎంతటి ప్రతిచర్యలు ఉంటాయన్న విషయాన్ని మాత్రం చైనా ఇంకా ప్రకటించలేదు.

వివరాలు 

 స్టీల్,అల్యూమినియం దిగుమతులపై 50శాతం టారిఫ్ 

మే నెల మధ్యలో జెనీవాలో చైనా,అమెరికా మధ్య ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు తాత్కాలికంగా మూడు నెలల పాటు (90 రోజులపాటు)అధిక టారిఫ్‌లు విధించే చర్యలను నిలిపివేయాలి. దీనికి ప్రతిఫలంగా చైనా అమెరికాకు అరుదైన ఖనిజాలు,సెమీకండక్టర్,ఎలక్ట్రానిక్ రంగాలకు అవసరమైన ముడిసరకులు నిర్బంధం లేకుండా సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ తీవ్ర విమర్శ చేశారు.చైనా ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. చైనాలో ఉత్పత్తి అయ్యే స్టీల్,అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను పెంచుతూ, వాటిని 50 శాతానికి పెంచారు. ప్రపంచంలో అత్యధికంగా స్టీల్‌ను ఎగుమతి చేసే దేశం చైనా కావడంతో,ఈ నిర్ణయం వాణిజ్య సంబంధాలపై గణనీయ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.