Page Loader
Stock Market: కూప్పకూలిన స్టాక్ మార్కెట్.. ₹10 లక్షల కోట్లు ఆవిరి
కూప్పకూలిన స్టాక్ మార్కెట్.. ₹10 లక్షల కోట్లు ఆవిరి

Stock Market: కూప్పకూలిన స్టాక్ మార్కెట్.. ₹10 లక్షల కోట్లు ఆవిరి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Today) భారీ నష్టాల్లో ముగిశాయి. బలహీన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం, అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్చితి వంటి అంశాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ వంటి ప్రముఖ షేర్ల అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 23,000 పాయింట్ల దిగువకు చేరుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఓ దశలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 3 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 4 శాతం వరకూ తగ్గిపోయాయి. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల సంపద దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరై, రూ.410 లక్షల కోట్లకు పడిపోయింది.

వివరాలు 

సూచీల పతనం: 

సెన్సెక్స్ ఉదయం 75,700.43 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,190.46) నష్టాలతో ప్రారంభమైంది. నష్టాల శ్రేణి రోజంతా కొనసాగింది.ఇంట్రాడేలో 75,267.59 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 824.29 పాయింట్ల నష్టంతో 75,366వద్ద ముగిసింది. నిఫ్టీ 263.05 పాయింట్లు కోల్పోయి 22,829.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి 86.33వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్,జొమాటో,టెక్ మహీంద్రా,పవర్‌గ్రిడ్ కార్పొరేషన్,టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగియగా,ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 78.74 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 2769 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

నష్టాలకు కారణాలు: 

అమెరికా వాణిజ్య విధానం: అక్రమ వలసదారులపై కొలంబియాకు ట్రంప్ విధించిన సుంక బెదిరింపుల కారణంగా దేశాలు ఆందోళనలోకి వెళ్లాయి. ఇటువంటి హెచ్చరికలు కెనడా, మెక్సికోకు కూడా ఇంతకు ముందు జారీ చేసిన సంగతి తెలిసిందే. త్రైమాసిక ఫలితాల నిరాశ: త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం మదుపర్లలో నిరుత్సాహం కలిగించింది. బడ్జెట్‌పై ఆశలు తగ్గడం: ఫిబ్రవరి 1న విడుదలయ్యే బడ్జెట్‌పై మదుపర్లకు ఆశలు తగ్గిపోవడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు: వడ్డీ రేట్ల కోత ఉండదన్న అంచనాలు, భవిష్యత్తు ఫెడరల్ వైఖరిపై మార్కెట్ ఎదురుచూపులు నష్టాలకు దారితీశాయి.

వివరాలు 

విదేశీ మదుపర్ల అమ్మకాలు:

గత ట్రేడింగ్ సెషన్ నాటికి విదేశీ సంస్థాగత మదుపర్లు సుమారు రూ.64 వేల కోట్ల ఈక్విటీలను విక్రయించారు. సమీప భవిష్యత్‌లో ఈ ట్రెండ్ మారుతుందన్న అంచనాలు లేకపోవడం మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచింది.