Credit cards: నేటి నుంచి మారనున్న క్రెడిట్ కార్డు రూల్స్.. మీ క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ని మీరే ఎంచుకోవచ్చు
క్రెడిట్ కార్డు హోల్డర్లకు శుభవార్త! నేటి నుండీ కొత్త క్రెడిట్ కార్డు నియమాలు అమలులోకి వచ్చాయి. ఈ కొత్త మార్పుల ద్వారా, కస్టమర్లు తమ ఇష్టమైన క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ను స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. మీరు మాస్టర్ కార్డ్, రూపే, వీసా కార్డ్‌లలో ఏదైనా ఇష్టపడితే, మీరు ఆ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మీ కోరిక మేరకు క్రెడిట్ కార్డు సంస్థలు మీకు కొత్త కార్డు మంజూరు చేస్తాయి. ఈ నియమం రెన్యువల్ కార్డులకు కూడా వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించి, డిజిటల్ చెల్లింపుల్లో పోటీని పెంపొందించడానికి ఈ నిబంధనలను తీసుకొచ్చింది.
యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త నిబంధనలను అమలు చేశాయి
ఇంతకుముందు, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు ఒకే క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌తో ప్రత్యేక ఒప్పందాల ఆధారంగా కార్డులను జారీ చేసేవి. ఈ విధంగా వినియోగదారులు ఏ కార్డును జారీ చేస్తారో ఆ కార్డునే తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, సెప్టెంబర్ 6 నుండి ఖాతాదారులు తమకు కావలసిన నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకొని, బ్యాంకుల నుండి ఆ క్రెడిట్ కార్డు పొందవచ్చు. మాస్టర్ కార్డ్ లేదా వీసా కార్డులను ఉపయోగిస్తున్న కస్టమర్‌లు రూపే కార్డులకు మారవచ్చు, లేదా ప్రస్తుతం ఉన్న కార్డును కొనసాగించవచ్చు. యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ఇప్పటికే ఈ కొత్త నిబంధనలను అమలు చేశాయి. సెప్టెంబర్ 6 నుంచి దేశంలోని అన్ని బ్యాంకులు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి.
UPI యాప్‌లలో RuPay కార్డును ఇంటిగ్రేట్ చేసే ఆప్షన్
ఆర్బీఐ మార్చి లో ఈ సర్క్యులర్‌ను జారీ చేసింది, కానీ 10 లక్షల కంటే తక్కువ యాక్టివ్ కార్డులు ఉన్న సంస్థలు, సొంత నెట్‌వర్క్ ఆథరైజేషన్ కలిగి ఉన్న సంస్థలు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, UPI యాప్‌లలో RuPay కార్డును ఇంటిగ్రేట్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉంది. Google Pay వంటి యాప్‌లలో RuPay కార్డ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు, అయితే ఇది కేవలం బిజినెస్ అకౌంట్లకే అందుబాటులో ఉంది. ఈ చెల్లింపులకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేవు, సేవింగ్స్ ఖాతా వలె RuPay కార్డును ఉపయోగించవచ్చు. అయితే, బిల్లు వచ్చిన తర్వాత గడువు తేదీలోగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.