హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
గ్లోబల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోకు చాలా ప్రసిద్ధి. ఈ సంస్థ హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ)ని ఏర్పాటు చేయడం ద్వారా వైబ్రెంట్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్ హబ్‌లోకి డిస్కవరీ గ్రూప్ ప్రవేశిస్తోంది. హైదరాబాద్‌లో గ్రూప్ ఐడీసీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా డిస్కవరీ గ్రూప్ 1,200 మంది నిపుణులకు ఉపాధిని కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
డిస్కవరీ గ్రూప్ ఫైనాన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ను కలిసిన కేటీఆర్
ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, డిస్కవరీ గ్రూప్ ఫైనాన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా కార్టర్‌ను కలిశారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ ఆకట్టుకునే బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోలో హెచ్‌బీఓ, హెచ్‌బీఓ మ్యాక్స్, సీఎన్ఎన్, టీఎల్‌సీ, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్ వంటివి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. భారతదేశంలోని వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కార్యకలాపాలకు హైదరాబాద్‌లోని ఐడీసీ వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతున్న కొద్దీ, దాని శ్రామిక శక్తిని మరింత విస్తరించనుంది.