Tax on Wedding Gifts: పెళ్లి కానుకగా ఇచ్చిన బంగారంపై పన్ను చెల్లించాలా? ఆదాయ పన్ను శ్లాబ్‌లు ఎలా ఉన్నాయి?
మీ పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చిన బంగారాన్ని అత్యవసరంగా అమ్మాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే.. భారతదేశంలో కానుకల రూపంలో పొందిన వస్తువులను వ్యక్తిగత ఆదాయంగా పరిగణించరు. కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి పొందిన కానుకల మొత్తం విలువ రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే, వాటిపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెళ్లి కానుకల విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, పెళ్లి సమయంలో బంధువులు, స్నేహితులు అందించే కానుకల విలువ రూ.50,000లోపు ఉంటే, ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానుకల విలువ రూ.50,000 దాటితే, దానిని 'ఇతర మార్గాల ద్వారా పొందిన ఆదాయం' కింద పరిగణించి పన్ను విధిస్తారు.
పుట్టింటివారు ఇచ్చిన బంగారంపై పన్ను ఉండదా?
ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ముఖ్యంగా, 'నిర్దిష్ట బంధువుల' నుంచి పొందిన కానుకలను వ్యక్తిగత ఆదాయంగా పరిగణించరు. ఈ లిస్ట్‌లో తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి పొందిన బంగారం పైన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
కానీ బంగారం అమ్మితే మాత్రం పన్ను కట్టాల్సిందే!
మీరు తల్లిదండ్రుల నుంచి పొందిన బంగారాన్ని అమ్మే విషయంలో మాత్రం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. బంగారం అమ్మినప్పుడు వచ్చిన డబ్బును మూలధన లాభం (క్యాపిటల్ గెయిన్)గా పరిగణిస్తారు. ఈ లాభాలను స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వర్గీకరిస్తారు. ఉదాహరణ: మీ తండ్రి కొనుగోలు చేసిన బంగారాన్ని పెళ్లి కానుకగా ఇచ్చారనుకుందాం. బంగారం కొనుగోలు చేసిన తేదీ నుంచి అమ్మే వరకు కాలం 24 నెలలలోపు ఉంటే, స్వల్పకాలిక లాభంగా పరిగణించి, అందుకు తగిన పన్ను విధిస్తారు. 24 నెలలకు మించి ఉంటే, దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 12.50 శాతం పన్ను విధిస్తారు.
బడ్జెట్‌లో ఇండెక్సేషన్ తొలగింపు
తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇండెక్సేషన్‌ను తొలగించారు. ఈ మార్పుతో బంగారం అమ్మకం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. గమనిక: మీరు 2001 ఏప్రిల్ 1కి ముందు బంగారం కొనుగోలు చేసి ఉండినా, లేదా బహుమతిగా పొందినా, 2001 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ విలువను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక లాభాలపై పన్ను భారం తగ్గించుకోవచ్చు.